రాజమహేంద్రవరం సిటీ: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన జరుగనున్న నీట్ రీ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే అభ్యర్థులందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలిపిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి వై.సత్యనారాయణమూర్తి బుధవారం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న రాజమహేంద్రవరం, కొవ్వూరు, గోకవరం, నిడదవోలు డిపోల నుంచి బస్సులు నడుపుతున్నట్లు తెలియజేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లు చూపించి పరీక్షా కేంద్రాలకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో ప్రయాణం చేయవచ్చునన్నారు. బస్ స్టేషన్లో సహాయక సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రేపటి నుంచి పీఠంలో
యథావిధిగా శ్రీచక్ర అర్చనలు
రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో శుక్రవారం నుంచి యథావిధిగా శ్రీచక్ర అర్చనలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు బుధవారం విలేకరులకు తెలిపారు. విజయదుర్గా పీఠాధిపతి గాడ్ ఈ నెల 5న విజయదుర్గాదేవి సాయుజ్యం పొందిన నేపథ్యంలో పీఠంలో అమ్మవారికి నిర్వహించే నిత్య పూజలు, అర్చనలు ఏకాంతంగా నిర్వహిస్తున్నా రు. శుక్రవారం ఉదయం 9.15 గంటల నుంచి పీఠంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు.
అన్నవరం.. తృతీయం
● ఐవీఆర్‌ఎస్ సర్వేలో
దేవస్థానానికి మూడో స్థానం
● వెల్లడించిన ప్రభుత్వం
అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వస్తున్న భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం ఈ నెలలో నిర్వహించిన సర్వేలో 73 శాతం భక్తుల సంతృప్తితో అన్నవరం దేవస్థానం మూడో స్థానంలో నిలిచింది. గత నెలలో అయితే 70.7 శాతంతో ఏకంగా ఐదో స్థానానికి పడిపోగా.. ఈసారి రెండు స్థానాలు అధిగమించి మూడో స్థానానికి ఎగబాకింది. గత నెల కన్నా 2.3 శాతం ఎక్కువగా మాత్రమే భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గత మార్చి నెలలో నిర్వహించిన సర్వేలో 75 శాతం భక్తుల సంతృప్తితో అన్నవరం దేవస్థానం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత నుంచి ఆ ర్యాంకు క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత నెల 15 నుంచి ఈ నెల 15వ తేదీ వరకూ వాట్సాప్ యాప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాలపై నిర్వహించిన ఈ సర్వేలో 75.8 శాతం భక్తుల సంతృప్తితో శ్రీకాళహస్తి మొదటి, 74.2 శాతంతో ద్వారకా తిరుమల రెండు స్థానాల్లో నిలిచాయి. వరుసగా తరువాతి స్థానాల్లో సింహాచలం, కాణిపాకం, విజయవాడ, శ్రీశ్రీలం దేవస్థానాలు నిలిచాయి.


