రాజమహేంద్రవరం/మండపేట (కపిలేశ్వరపురం): దాదాపు మూడు నెలల నుంచి ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వాతావరణంతో అల్లాడుతున్న ప్రజలు బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం, చల్లని గాలులకు ఊపిరి పీల్చుకున్నారు. రాజమహేంద్రవరం నగరం, రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కడియం మండలాన్ని వాన ముంచెత్తింది. కడియం, వేమగిరి, కడియపులంక, జేగురుపాడు, మురమండ, వీరవరం తదితర గ్రామాల్లో భారీ వర్షంతో ఎక్కడికక్కడే జనజీవనం స్తంభించి పోయింది. మెట్ట ప్రాంతంలో జోరు వాన కురిసింది. దేవరపల్లిలో సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు ఉరుములు, మెరుపుల ధ్వనులతో ఆకాశం దద్ధరిల్లింది. ద్వారపూడి పరిసర గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఏకథాటిగా గంటపాటు వర్షం కురిసింది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక వాడలు వర్షంలో తడిసి ముద్దయ్యాయి.


