భవిష్యనిధి కమిషనర్ వెంకటేశ్వర్లు
ఆల్కాట్‌తోట
(రాజమహేంద్రవరం రూరల్):
భారత ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ (పీఎంవీబీఆర్‌వై) కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం 4 గంటలకు దివాన్‌చెరువులోని ఎస్‌వీపీసీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్ వెంకటేశ్వర్లు కలువాయి అన్నారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉపాధి కల్పనకు ప్రోత్సాహం, యువతకు ఉద్యోగ అవకాశాల పెంపు, సామాజిక భద్రత పరిధి విస్తరణ లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం కింద మొదటిసారి ఉద్యోగంలో చేరే అర్హులైన ఉద్యోగులకు ఒక నెల వేతనానికి సమానంగా గరిష్టంగా రూ.15 వేల వరకు ప్రోత్సాహకం అందజేస్తారన్నారు. అదనపు ఉపాధి అవకాశాలు కల్పించే యజమానులకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయన్నారు. తయారీ రంగంలో ఉద్యోగాలు కల్పించే యజమానులకు ఈ ప్రయోజనాలు మరో రెండేళ్ల పాటు పొడిగిస్తారన్నారు. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు సృష్టించే ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు.
చికిత్స పొందుతూ
యువతి మృతి
మామిడికుదురు: సిలిండర్ ట్యూబ్ నుంచి గ్యాస్ లీకై వ్యాపించిన మంటల్లో తీవ్రంగా గాయపడిన ఈదరాడ కమ్మవారిలంకకు చెందిన చుట్టుగుళ్ల చంద్రప్రియ (23) కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్టు నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ బుధవారం తెలపారు. ఆమె మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అమలాపురం ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తున్న చంద్రప్రియ ఆదివారం సెలవు రోజు కావడంతో తండ్రి వెంకటేశ్వరరావు అమలాపురం నుంచి ఆమెను ఇంటికి తీసుకు వచ్చారు. ఆయనకు వంట చేసి పెట్టాక ఆమ్లెట్ వేసుకునేందుకు వంటింటిలోకి వెళ్లి లైట్ స్విచ్ ఆన్ చేయగా ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు తొలుత ఆమెను రాజోలుకు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె అక్కడ మృతి చెందింది. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. ఆమె తల్లి సాయిజ్యోతి ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారు. ఆమెకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు.
గొలుసు చోరీ కేసులో
నిందితుడికి ఆరు నెలల జైలు
రాయవరం: చైన్ స్నాచింగ్ కేసులో నేరారోపణ రుజువు కావడంతో కోర్టు ముద్దాయికి జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్సై డి.సురేష్‌బాబు బుధవారం విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు 2025లో మండలంలోని వెంటూరులో గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి అనే మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కువెళ్లినట్టు వచ్చిన ఫిర్యాదుపై నిందితుడు సాధనాల వెంకటేష్‌ను అరెస్ట్ చేసి, స్వాధీనం చేసుకున్న గొలుసును కోర్టుకు సమర్పించారు. నేరం రుజువుకావడంతో అనపర్తి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.వంశీకృష్ణ వెంకటేష్‌కు ఆరు నెలల జైలు, రూ.50 జరిమానా విధించారు. ఈ కేసులో ఏపీపీ ఒ.మహాలక్ష్మి వాదనలు వినిపించినట్టు ఆయన తెలిపారు. కోర్టు కానిస్టేబుల్ సత్యకుమార్‌ను ఉన్నతాధికారులు అభినందించినట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు.


