గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు

Jun 18 2026 12:35 AM | Updated on Jun 18 2026 12:35 AM

ఒకరి మృతదేహం లభ్యం

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు

మరొకరి కోసం గాలిస్తున్న సిబ్బంది

పెరవలి (కొవ్వూరు): స్నేహితుల సరదా ప్రాణాల మీదకు తెచ్చింది. స్నానం కోసం వచ్చిన ఇద్దరు యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లితండ్రులకు కడుపుకోత మిగిల్చారు. కొవ్వూరు మండలం మద్దూరు లంక వద్ద బుధవారం ఇద్దరు యువకులు గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరానికి చెందిన మురముళ్ల ప్రవచన కిషోర్‌, మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన పైడిమల్ల ప్రవీణ్‌ నిడదవోలుకు చెందిన మరో నలుగురు స్నేహితులు గోదావరిలో స్నానాలు చేయడానికి నిశ్చయించుకున్నారు. ప్రవచన కిషోర్‌, పైడిమల్ల ప్రవీణ్‌ రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు మద్దూరు లంక చేరుకున్నారు. నిడదవోలు నుంచి స్నేహితులు ఇంకా రావడం లేదని ఎండ వేడి ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో వారిద్దరూ గోదావరిలో స్నానానికి దిగారు. స్నేహితులు వచ్చేటప్పటికి నదీ తీరంలో వారిద్దరి బట్టలు, షూష్‌ చూసి స్నేహితులు వచ్చి ఉంటారని ఆనందంతో ముందుకు వెళ్లారు. ఎంతసేపటికీ వారు కనపడకపోవడంతో ఆందోళన చెందిన స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన వచ్చి ఆ ప్రాంతం అంతా జల్లెడ పడుతున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో ప్రవచన కిశోర్‌ (21) మృతదేహం దొరికింది. మృతదేహాన్ని ఒడ్డుకి తీసుకురావటంతో తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గల్లంతైన పైడిమల్ల ప్రవీణ్‌ కోసం గాలిస్తున్నారు. ప్రవీణ్‌ కోసం వారి తల్లితండ్రులు, బంధువులు తల్లిడిల్లిపోతున్నారు. కిశోర్‌ మృతదేహం వద్ద తండ్రి కన్నీరు పెట్టుకుంటూ లేవరా కిషోర్‌ ఎక్కడికి వెళ్లిపోయావురా, మమ్మల్ని ఒంటరివాళ్లను చేసి వెళ్లిపోయావా అంటూ రోదిస్తుంటే చుట్టుపక్కల వాళ్లు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement