● అక్రమ కట్టడాలు, మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలి
● ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను
● కలెక్టర్ దినేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేత
చింతూరు: డివిజన్ పరిధిలోని ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ సాగుతున్న అక్రమ కట్టడాలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన చింతూరులో కలెక్టర్ దినేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులు, భూములను రక్షించడంలో స్థానిక అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతూరు మండలం మోతుగూడెం, వీఆర్ పురం మండలం కొల్లూరులో ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అక్రమ రిసార్టులపై చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. డివిజన్‌లోని అటవీ ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా ఎలాంటి లీజులు, పర్యావరణ అనుమతులు లేకుండా విలువైన తెల్లరాయిని అక్రమంగా తవ్వేస్తూ సరిహద్దులు దాటిస్తున్నారని, దీనివల్ల స్థానిక వాగులు, ధ్వంసమవుతున్నాయని ఆయన తెలిపారు. అడవులను నరికివేస్తూ పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న మైనింగ్ మాఫియా ఆగడాలను అరికట్టాలని, దీనికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పరిషత్ జిల్లా అధ్యక్షుడు కూర చిట్టి బాబు పాల్గొన్నారు.


