సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్య విభేదాలు ఊహించని స్థాయికి చేరాయి. ఇద్దరు నేతల పార్టీలు కూటమిలో భాగస్వామ్యమైనా సఖ్యత ఉండటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు రాజమహేంద్రవరంలో జరుగుతున్న ప్రభుత్వ, అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి, ఎమ్మెల్యే ఒకరినొకరు ఆహ్వానించుకోకపోవడం నిదర్శనం. మంత్రి నేతృత్వంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం అందకపోవడం, ఎమ్మెల్యే నిర్వహించే ప్రోగ్రామ్స్‌కి మంత్రిని పిలవకపోవడం పరిపాటిగా మారింది. మీరు పిలవనప్పుడు మేం ఎందుకు పిలవాలన్నది ఇరు పక్షాల ప్రశ్నగా మారింది. కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు మంత్రి తప్ప మిగిలిన రాజమహేంద్రవరం నగరానికి చెందిన జనసేన నేతలకు ఆహ్వానం అందుతోందని, తమ పార్టీ నాయకులే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వెంట నడుస్తుండటం, తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం మంత్రి దుర్గేష్‌కు నచ్చడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రాజమహేంద్రవరంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొనకపోవడం, పలు కార్యక్రమాల ఫ్లెక్సీల్లో ఎవరి ప్రోగ్రామ్‌లో వాళ్ల ఫొటోలు మాత్రమే ఉండటం, మిత్రపక్షం నేతలవి కనిపించకపోవడం, మంత్రి దుర్గేష్ స్థానిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫొటో వేయకపోవడం, ఎమ్మెల్యే కార్యక్రమాల్లో మంత్రి ఫొటోను వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇవన్నీ ఉద్దేశ పూర్వకంగానే జరుగుతున్నాయన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట.
పర్యాటక పనులే కారణమా?
రాజమహేంద్రవరం సిటీలో మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వర్గాల మధ్య విభేదాలకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పుష్కర పనులే కారణమన్న ఆరోపణలున్నాయి. నగరంలో సుమారు రూ.92 కోట్లతో రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్, పుష్కర్ ఘాట్ ఆధునికీకరణ, అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. పనుల్లో తమకు భాగస్వామ్యం కల్పించకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే వాసు అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. తమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో తమ ప్రమేయం లేకపోవడం ఏంటన్న ప్రశ్న టీడీపీ శ్రేణుల నుంచి వెల్లువెత్తుతోంది. పనుల వివరాలు తనకు చెప్పడం లేదని వాసు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం పర్యటనకు వచ్చిన సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు కనీస సమాచారం, ఆహ్వానం కూడా అందలేదని ఎమ్మెల్యే వాసు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మంత్రి దుర్గేష్ పెత్తనానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. మరోపక్క మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం సిటీ జనసేన నేతలతో సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. తనకు ఆహ్వానం లేని కార్యక్రమాలకు జనసేన నేతలు ఎందుకు హాజరవుతున్నారని ప్రశ్నించినట్లు సమాచారం.
బుచ్చయ్య కూడా..
పుష్కర ఘాట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసహనం వ్యక్తం చేశారు. పుష్కరఘాట్లో పనులు సరిగా జరగడం లేదన్నారు. కట్టడాలు కట్టి పుష్కర ఘాట్ వ్యూ అంతా చెడగొడుతున్నారని మండిపడ్డారు. కూటమిలో భాగస్వామ్యమైన జనసేన మంత్రి దుర్గేష్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై కూటమికి చెందిన ఎమ్మెల్యే బహిరంగంగా విమర్శలు చేయడం వెనుక ఆంతర్యం దాగుందన్న విమర్శలు వస్తున్నాయి. పుష్కర పనుల్లో తమకు, తమ అనుచరులకు లబ్ధి చేకూరలేదన్న ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రిని టార్గెట్ చేస్తూ ఇలాంటి విమర్శలకు దిగడం ఎంత వరకు సమంజసమని జనసేన నేతలు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే.. జనసేన, టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య ఏ మేరకు సఖ్యత ఉందో అర్థమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఏఐ సహాయంతో అందించిన చిత్రం
మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే వాసు
వర్గాల మధ్య విభేదాలు
పైకి కలసి ఉంటున్నా..
అంతర్గతంగా అంతరం
పుష్కర పనుల్లో మొదలైన వైరం
అధికారిక కార్యక్రమాల్లో సైతం
కనిపించని ఇద్దరు నేతలు
మంత్రి టార్గెట్‌గా ఎమ్మెల్యేల వ్యాఖ్యలు
మంత్రి కందుల దుర్గేష్‌ను టార్గెట్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు బహిరంగ వ్యాఖ్యలకు దిగారు. పుష్కర పనులు మంత్రి ఆధ్వర్యంలో నడుస్తుండటం, వాటిలోతమ అనుచరులు, తాము పనులు చేసుకునే వెసులుబాటు కల్పించలేదన్న భావనతో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. పుష్కర ఘాట్‌లో పనుల పరిశీలనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే వాసు బహిరంగంగా విమర్శలు చేశారు. పుష్కరఘాట్లో పనులు నిర్వహిస్తున్న తీరును ఎమ్మెల్యే వాసు ప్రెస్‌మీట్ పెట్టి మరీ తప్పుబట్టారు. ఘాట్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్న సమాచారం స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు లేదన్నారు. కనీసం మంత్రి దుర్గేష్‌కు అయినా సమాచారం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఘాట్‌లో నూతనంగా అమరుస్తున్న టైల్స్ జారుడు స్వభావం ఉన్నవని, గత పుష్కరాల దుర్ఘటన నేపథ్యంలో అలాంటి టైల్స్ అమర్చడం ఏంటని ప్రశ్నించారు. గోదావరి మాత విగ్రహం ఎదురుగా వాటర్ ఫౌంటేన్ అవసరమా? అని ప్రశ్నించారు. దీనిపై ఎంపీ పురందేశ్వరి సైతం అసహనం వ్యక్తం చేశారన్నారు. ఫౌంటేన్ పనులు ఆపిస్తామని ఎంపీ చెప్పినట్లు వెల్లడించారు. ఈ విషయమై మంత్రి దుర్గేష్‌తో చర్చిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. స్వపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఇలా ప్రశ్నించడంతో పనుల నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి.


