అనపర్తి: మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మరో 11మంది వైఎస్సార్ సీపీ నాయకులపై అనపర్తి పోలీసులు ఈ నెల 13న కేసు నమోదు చేశారు. ఈ నెల 12న దేవి సెంటర్‌లో డాక్టర్ సూర్యనారాయణరెడ్డి నేతృత్వంలో చేసిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు గుమిగూడారంటూ కేసు నమోదు చేశారు. మాజీ సర్పంచ్ వెంకటరమణ (రాజుపాలెం), నాగిరెడ్డి (కుతుకులూరు), సబ్బెళ్ల కృష్ణారెడ్డి (రామవరం), మాదాబత్తుల శంకర్ , మందా వెంకటరెడ్డి(మందా శ్రీను), మహిళా నేత విజయలక్ష్మి, అద్దంకి ముక్తేశ్వరరావు, కర్రి శ్రీవెంకటరెడ్డి (మామిడాడ), వల్లభశెట్టి రామసతీష్ (దుప్పలపూడి), కర్రి యేసుదాసు, కొండేటి భీమేష్‌లతో పాటు మరికొందరు నిరసనకారులు వైఎస్సార్ సీపీ జెండాలను ప్రదర్శిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు అనపర్తి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎంపీటీసీ సభ్యుడు మట్టా శ్రీనుపై కేసు నమోదు
రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, ఎంపీటీసీ సభ్యుడు మట్టా శ్రీనుపై శనివారం అనపర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. తమ నాయకుడు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై అనపర్తిలో జరిగిన ఒక కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీటీసీ శ్రీనుపై అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.
చెరువును కబ్జా చేస్తున్నారని
రైతుల ఆందోళన
– గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
రంగంపేట: మండలంలోని పెద్ద దొడ్డిగుంట గ్రామంలోని ముసలయ్య చెరువులో అక్రమంగా మట్టి తవ్వి చెరువును పూడ్చివేస్తున్నారని ఆయకట్టు రైతులు ఆరోపించారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కలిసి జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో అర్ధరాత్రి వేళ చెరువులోని మట్టిని తరలిస్తూ చెరువును సగం వరకు కప్పివేస్తున్నారని రైతులు తెలిపారు. ముసలయ్య చెరువుకు మెరక తూము, పల్లం తూము ఉండగా, ఈ తూముల కింద రెండు కాలువలు ఉన్నాయని పేర్కొన్నారు. చెరువును పూడ్చివేయడం వల్ల ఆయకట్టు భూములకు సాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై గ్రామ రైతులు వీఆర్వో, ఎమ్మార్వోలకు వినతిపత్రాలు అందజేసి సమస్యను పరిష్కరించాలని కోరినప్పటికీ, పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెనన్స్‌లో ఫిర్యాదు చేసినట్లు రైతులు అడబాల శ్రీను, రమేష్, రామదాసు, వీరభద్రరావు, కష్ణ, వెంకట్రావు, చిన్నారావు, కనకం తెలిపారు.
ఆధ్మాతికతకు కేంద్ర బిందువుగా విజయదుర్గా పీఠం
– గజల్ శ్రీనివాస్
రాయవరం: విజయదుర్గా పీఠం ఆధ్మాత్మికతకు కేంద్ర బిందువుగా మారిందని, ఈ ఘనత పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం(గాడ్)కు దక్కుతుందని గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయదుర్గా పీఠాధిపతి గాడ్ ఈ నెల 5న విజయదుర్గాదేవి సాయుజ్యం పొందిన నేపథ్యంలో సోమవారం గాడ్ దశ దిన కర్మ సందర్భంగా సంస్మరణ సభ నిర్వహించారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విజయదుర్గా పీఠం ఏర్పాటు చేసి, నిత్యం వేలాది మంది భక్తుల సమస్యలకు పరిష్కారం చూపారన్నారు. గాడ్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలన్నారు. సంస్మరణ సభలో పలువురు గాడ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గాడ్ గొప్పదనాన్ని కీర్తిస్తూ శ్రీనివాస్ గజల్స్ ఆలపించారు. గాడ్ సోదరుడు వీవీ బాపిరాజు, కుమార్తెలు బలిజేపల్లి రమ, గాదె సత్యవెంకటకామేశ్వరి, పెదపాటి సత్యకనకదుర్గ, అల్లుళ్లు గాదె భాస్కరనారాయణ, పెదపాటి శ్రీనివాసమూర్తి, పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి)ల ఆధ్వర్యంలో భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఎంపీపీ నౌడు వెంకరటమణ, వైద్యులు జీఎస్‌ఎన్‌రెడ్డి, తేతల నవీన్‌రెడ్డి, గోపిరవితేజ, సర్పంచ్‌ల సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పడాల వెంకటరామారెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ తేతల సుబ్బరామారెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు తేతల కమలారెడ్డి, శివశంకరరెడ్డి పాల్గొన్నారు.


