● పీజీఆర్‌ఎస్‌లో పరిష్కారం కాని సమస్యలు
● పేరుకుపోతున్న అర్జీలు
● అసహనంతో సమాధానం
ఇస్తున్న అధికారులు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) వల్ల ఉపయోగం లేకుండా పోయిందని అర్జీదారులు వాపోతున్నారు. కలెక్టరేట్‌కి వస్తున్న అర్జీదారుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తమ సమస్యల పరిష్కారం కోసం జనం మళ్లీ మళ్లీ కలెక్టరేట్‌కి వస్తూనే ఉన్నారు. తమ సమస్యల పట్ల అధికారులు అసహనంతో సమాధానం చెబుతున్నారని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిలో పెన్షన్‌కి సంబంధించిన అర్జీలు ఎక్కువగా ఉండటం గమనార్హం.
పెన్షన్‌కి సదరం అడ్డంకి
విభిన్న ప్రతిభావంతులు ఎవరికై నా పెన్షన్ రావాలంటే సదరం సర్టిఫికెట్ ఉండాలి. కాని ఈ సర్టిఫికెట్ తీసుకురావాలంటే పెద్ద యుద్ధమే చేయవలసి వస్తుంది. 2026 జనవరి 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు పీజీఆర్‌ఎస్‌కి అన్ని రకాల సమస్యల కోసం (రెవెన్యూ తప్ప) 13,024 అర్జీలు వచ్చాయి. వీటిలో 9,810 అర్జీలు పరిష్కరించగా ఇంకా 3 వేలకి పైగా పరిష్కారం కాలేదు. వీటిలో పెన్షన్ కోసం వచ్చిన అర్జీలే అధికం. 2025 డిసెంబర్ 29 నుంచి రెవెన్యూ క్లినిక్‌లో 1,856 అర్జీలు వచ్చాయి. వీటిలో 1,198 పరిష్కారం చూపించారు. ఇంకా 658 మంది కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల 15 నుంచి నూతన పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. కొత్త పెన్షన్‌లు అర్హలందరికీ ఇస్తామని గొప్పలు పోతుంది. కాని ఈ రెండు సంసవత్సరాల కాలంలో పెన్షన్ కోసం కాళ్లరేగిలా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న అర్జీదారులు అవేదనను అర్థం చేసుకోలేకపోతోంది. పాత పెన్షన్‌కే దిక్కులేదు.. కొత్త పెన్షన్‌లు ఎక్కడ ఇస్తారని అర్జీదారులు పెదవి విరుస్తున్నారు.
బోరు బావికి అనుమతులివ్వండి
ముక్కుపాటి సత్యవాణి గోకవరం మండలం తిరుమలపాలెంలో 3 ఎకరాల 50 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఈ స్థలం తమదని పక్కనున్న వారు తగదాకు దిగారు. కోర్టును ఆశ్రయించగా సత్యవాణికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కాని ప్రత్యర్థులు అధికారులతో కుమ్మక్కు కావడంతో వారి పొలంలో బోరు వేసుకోవడానికి కింది స్థాయి అధికారులు సహకరించడం లేదు. దీనిపై ఇప్పటికి 8 సార్లు కలెక్టరేట్‌కి వచ్చినా తమ సమస్య పరిష్కారం కాలేదని, అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
– ముక్కుపాటి సత్యవాణి, తిరుమలపాలెం
గూడు చెదిరిన బాధ
రాజమహేంద్రవరంలోని 44, 47 డివిజన్‌లోని పుంత రోడ్డులో 50 సంవత్సరాలుగా నివసిస్తున్న వారి ఇళ్లను ఈ నెల 13వ తేదీన కూల్చివేశారు. తమకి న్యాయం చేయాలని నిరాశ్రయులందరూ సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. సాక్షిలో వచ్చిన గూడు చెదిరి... గుండె పగిలి.. కథనాన్ని కలెక్టర్‌కి చూపించారు. అంతేకాకుండా పుంతలో టీడీపీ నాయకులు సైట్ ఫర్ సేల్ అనిబోర్డును పెట్టారని, తెలపడంతో కలెక్టర్ పరిశీలిస్తామని చెప్పారు.
కలెక్టర్‌కి వినతి పత్రం ఇస్తున్న పుంత ప్రజలు


