సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)–2026 కార్యక్రమాన్ని ప్రాధాన్యంతో నిర్వహించి, ఓటరు జాబితాల కచ్చితత్వాన్ని మరింత మెరుగుపరిచే దిశగా పనిచేయాలని కలెక్టర్ కీర్తి అధికారులను ఆదేశించారు. సోమవారం బొమ్మూరులోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, అందిన అర్జీలను సకాలంలో, నాణ్యతతో పరిష్కరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో 243 అర్జీలు అందాయి. రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించిన 106 అర్జీలను జాయింట్ కలెక్టర్ వై. మే స్వరూప్, ఆర్డీవోలు స్వీకరించగా, ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలను కలెక్టర్ కీర్తి ఇతర అధికారులతో కలిసి స్వీకరించారు.
విద్యా దోపిడీకి ప్రభుత్వం
బాధ్యత వహించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రైవేట్ విద్యా దోపిడీకి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని, దోపిడీని అరికట్టడంలో విఫలమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిరణ్‌కుమార్ తెలిపారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో డీఈవోను కలిసి సోమవారం పరిస్థితి వివరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రులను దారుణంగా దోచుకుంటున్నాయన్నారు. అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు, రవాణా, ప్రత్యేక తరగతులు, ఇతర అదనపు వసూళ్ల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తూ సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా ఛిన్నాభిన్నం చేస్తున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయిన ప్రభుత్వం నేడు ప్రైవేట్ విద్యా వ్యాపారుల ప్రయోజనాలకే పని చేస్తోందన్నారు. అనేక ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేయకపోతే పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ కార్యాలయాల ముట్టడులు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కే.భాను ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, చంద్రశేఖర్ జిల్లా నాయకులు, శ్రీను పాల్గొన్నారు.
పోలీసు స్పందనకు
20 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 20 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ డి.నరసింహాకిశోర్ అర్జీదారులతో నేరుగా మాట్లాడారు. ఎస్పీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, డీఎస్పీలతో బాధితుల సమక్షంలోనే ఫిర్యాదులను పరిశీలించి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించి, న్యాయం చేయవల్సిందిగా అధికారులను ఆదేశించారు.


