పెళ్లయి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మద్ది సత్యకు కోరియా వ్యాధి సోకడంతో 2023లో కాళ్లు చేతులూ చచ్చుబడిపోయాయి. 33 సంవత్సరాలకే ఇటువంటి పరిస్థితి ఎదురవడంతో బాధతో కుమిలి పోతోంది. భర్త తన ఇద్దరి పిల్లలతో పాటు భార్యని కూడా చిన్న పిల్లలా చూసుకుంటూ అన్ని పనులు చేస్తున్నాడు. ఇటువంటి స్థితిలో భార్యకి పింఛన్ వస్తే పరిస్థితి కొంచెం మెరుగు పడుతుందనే ఆశతో 2024 నుంచి పెన్షన్ కోసం తిరుగుతున్నాడు. కాని ఇప్పటి వరకు పెన్షన్ మంజూరు కాలేదు.
– మద్ది సత్య, కోరియా వ్యాధిగ్రస్తురాలు, రాజమహేంద్రవరం
న్యాయం కోసం వినతి
చాగల్లుకు చెందిన జగత చంద్రిక రాణికి 14 సంవత్సరాలు వచ్చినా రెండున్నర అడుగుల ఎత్తుతో ఆమె పెరుగుదల ఆగిపోయింది. స్కూల్‌కి వెళితే అవమానాలు, వీధిలో ఆడుకోవడానికి వెళితే ఛీదరింపులు. ఇవన్ని భరించలేని ఆ అమ్మాయి మానసికంగా కుంగిపోయింది. 9వ తరగతి చదువుతున్న తన కూతురికి పెన్షన్ వస్తే కొంత ఆసరాగా ఉంటుందనే ఆశతో దరఖాస్తు చేసుకున్నారు. సదరన్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేయగా ఇది అంగవైకల్యం కిందకి రాదని చెప్పడంతో పెన్షన్ వచ్చే పరిస్థితి కనిపించక న్యాయం చేయాలని కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు.
– జగత చంద్రిక రాణి, చాగల్లు


