● 322 పారా మెడికల్ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం నోటిఫికేషన్
● ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన విడుదల
● కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పూర్తయిన ప్రక్రియ
● ‘తూర్పు’న 162 పోస్టులు తామే భర్తీ చేసుకుంటామన్న అధికారులు
● తొలుత 77, తరువాత 79 పోస్టుల భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్లు, రద్దు
● గత ఏడాది డిసెంబర్‌లో 60 పోస్టులకు మరోసారి నోటిఫికేషన్
● ఈ ఏడాది ఏప్రిల్‌లో 39 పోస్టులకు మరొకటి..
● ఇవన్నీ తామే ఇచ్చామంటూ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గొప్పలు
బేరం పెట్టడానికేనా!
ఈ పోస్టుల భర్తీకి బేరసారాలు సాగుతున్నాయని, అందువల్లనే నియామక ప్రక్రియను ముందుకు సాగనీయకుండా నోటిఫికేషన్ల రద్దుతో కుట్ర చేస్తున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. రాజమహేంద్రవరం వైద్య కళాశాలలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగానికై నా అర్హత లేని తన ప్రియురాలికి రెగ్యులర్ పోస్టు ఇచ్చి ఓ సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్ అయ్యాడు. నిజాయితీగా పని చేస్తున్న మహిళా ఏఓ సీటు మార్చిన ఘనులు, ఉద్యోగాలు హోల్‌సేల్‌గా అమ్ముకున్న ఉద్దండులు ఇక్కడే కొలువై ఉన్నారు. వీటన్నింటి నేపథ్యంలో 3, 4 నోటిఫికేషన్లలోనూ జాప్యం కొనసాగుతూండటంపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాము చెప్పిన వారికే ఉద్యోగాలివ్వాలనే రాజకీయ ఒత్తిళ్లు నియామక ప్రక్రియను ఏమాత్రం ముందుకు కదలనీయడం లేదని ఆరోపిస్తున్నారు. నియామక ప్రక్రియలో జాప్యంపై ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎంఎస్ రాజును ‘సాక్షి’, నిరుద్యోగులు వివరణ కోరగా స్పందించలేదు. దీనిపై తాము ప్రిన్సిపాల్‌ను కలవగా.. బయటకు వెళ్లమంటూ విసుక్కున్నారని కొందరు నిరుద్యోగులు ఆరోపించారు.
వాసూ.. ఇదేంటి బాసూ..
ఇన్ని అవాంతరాల మధ్య నియామక ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతూండగా.. దీనిపై అబద్ధాలు చెప్పి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నవ్వులపాయ్యారు. ఈ నెల 10న రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఆయన.. ఈ పోస్టులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నోటిఫికేషన్ పరిధిలోనివనే విషయాన్ని తొక్కిపెట్టి, తాము వచ్చాకే నోటిఫికేషన్లు ఓపెన్ చేశామని, తాము వచ్చాకే 99 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నామని చెప్పారు. తద్వారా గత ప్రభుత్వ క్రెడిట్‌ను చోరీ చేసేందుకు ప్రయత్నించారనే విమర్శలు వెల్లువెత్తాయి.
కాకినాడ క్రైం: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సామెత. గత ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు తన గొప్పగా తరచూ చెప్పుకుంటూంటారు. దీనికి తానేమీ తక్కువ కాదన్నట్టుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తీరు ఉందనే విమర్శలు వస్తున్నాయి.
ఏం జరిగిందంటే..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 322 పారామెడికల్ పోస్టుల భర్తీకి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ), డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్) పరిధిలో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి 162 పోస్టులున్నాయి. వీటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అప్పట్లోనే కాకినాడలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) కార్యాలయంలో నియామక ప్రక్రియ చేపట్టారు. కాకినాడ, కోనసీమ జిల్లాలకు సంబంధించి 160 మందినీ నియమించారు. కానీ, రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి, కళాశాలకు సంబంధించిన ఉద్యోగాలను తామే భర్తీ చేసుకుంటామని అప్పట్లో అధికారులు చెప్పారు. ఈ మేరకు నియామక ప్రక్రియను రాజమహేంద్రవరంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆలోగా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఇదీ రద్దుల పద్దు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి, కళాశాల పరిధిలో మొత్తం పోస్టులు 162. అయితే, ఎన్నికల అనంతరం, అక్కడి అధికారులు మొదట కేవలం 77 పోస్టులకే ఉద్యోగ ప్రకటన ఇచ్చారు. తరువాత వివిధ కారణాలతో దానిని రద్దు చేసి, రెండో నోటిఫికేషన్ 79 పోస్టులకు ఇచ్చారు. అనంతరం, దానిని కూడా రద్దు చేసి, గత ఏడాది డిసెంబర్ 22న 60 పోస్టులతో మూడో నోటిఫికేషన్ విడుదల చేశారు. తరువాత మరో 39 ఉద్యోగాలకు ఈ ఏడాది ఏప్రిల్ 7న నాలుగో నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం మూడు, నాలుగు నోటిఫికేషన్ల కింద 99 పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ పోస్టులన్నీ గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినవే కావడం గమనార్హం
కలెక్టర్‌కే టోకరా!
వాస్తవానికి ఈ పోస్టుల భర్తీ ఉమ్మడి జిల్లా పరిధిలో జరగాలి. నియామక ప్రక్రియను డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యాన చేపడతారు. ఈ కమిటీ చైర్మన్ కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంఽధిర ప్రసాద్. అయితే, ఇన్నిసార్లు నోటిఫికేషన్ ఇచ్చి, రద్దు చేసిన విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టకుండానే.. అధికారులు మరోసారి ఆయన సంతకాలతోనే నోటిఫికేషన్లు విడుదల చేయడం గమనార్హం. దీని వెనుక జరిగిన అసంబద్ధత కలెక్టర్‌కు తెలిసి ఉంటే తప్పకుండా ఆరా తీసేవారని నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కొత్త కలెక్టర్ కావడంతో విషయం ఆయనకు తెలియకుండా రాజమహేంద్రవరం వైద్య కళాశాల అధికారులు జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. ఈసారైనా నియామక ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా కలెక్టర్ నేరుగా జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.


