సిద్ధమేనా సర్‌! | - | Sakshi
Sakshi News home page

సిద్ధమేనా సర్‌!

Jun 15 2026 12:17 AM | Updated on Jun 15 2026 12:17 AM

నేటి నుంచి ఓటర్ల జాబితా

ప్రత్యేక సమగ్ర సవరణ

ఇప్పటికే ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తి

జిల్లాలో మ్యాపింగ్‌ కాని ఓట్లు 6,06,011

కపిలేశ్వరపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సిఫైడ్‌ రివిజన్‌ – ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ జిల్లాలో సోమవారం ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఓటు హక్కుకు సంబంధించి ఈ ప్రక్రియ ఎన్నో ఆరోపణలు, మరెన్నో సందేహాలు, సంచలనాలు రేపింది. లక్షలాదిగా ఓట్లు తొలగించారనే ఆరోపణలు అనేక రాష్ట్రాల్లో వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న సర్‌ ప్రక్రియపై ఓటర్లు, రాజకీయ పార్టీల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఆయా పార్టీల ప్రతిధులతో అధికారులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్‌ నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఇదీ ప్రక్రియ

జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో 7,77,700 ఇళ్లు ఉన్నాయి. మొత్తం 1,799 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 18,46,723 మంది ఓటర్లున్నారు. వారందరి ఓటు వివరాలను 2002 ఓటరు జాబితాతో సరిపోల్చుతూ ఇప్పటికే మ్యాపింగ్‌ చేశారు. 2026 జూన్‌ ఆరో తేదీ నాటికి మొత్తం 12,40,712 మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తయ్యింది. ఇంకా మ్యాపింగ్‌ కాని ఓటర్లు 6,06,011 మంది ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఓటు హక్కుకూ ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. 1987 లేదా అంతకంటే ముందు జన్మించిన పౌరుల వివరాలను ఇంటింటి సర్వే ద్వారా సేకరించి, సోమవారం నుంచి చేపట్టే ఎన్యూమరేషన్‌లో సంబంధిత ఫామ్‌లలో తప్పనిసరిగా నమోదు చేయాలి. ప్రస్తుత ఓటర్ల జాబితాతో 2002, 2011 ఓటర్ల జాబితాలను ఈ నెల 18వ తేదీ వరకూ మ్యాపింగ్‌ చేస్తారు. మ్యాపింగ్‌ పూర్తి కాని వారి వివరాలు 2026 ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండే అవకాశం లేదు.

శ్రీసర్‌శ్రీ షెడ్యూల్‌ ఇదీ..

సర్‌ నిర్వహణ కోసం బూత్‌ లెవెల్‌ అధికారులకు (బీఎల్‌ఓ) ఈ నెల 5 నుంచి శిక్షణ ఇచ్చారు. వీరు సోమవారం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకూ ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. అనంతరం, జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఆగస్టు 1 నుంచి 31వ వరకూ కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, పేర్ల తొలగింపు ప్రక్రియ చేపడతారు. జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్‌ 18లోగా పరిష్కరించి, అదే నెల 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.

ఓటర్లు ఏం చేయాలంటే..

బీఎల్‌ఓ ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చే ఎన్యూమరేషన్‌ పత్రాలను ఓటర్లు పూర్తి చేసి, తిరిగి వారికి ఇవ్వాలి. 2002 ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఆ వివరాలను ఆ పత్రంలో పేర్కొనాలి. పేరు లేకపోతే తల్లిదండ్రులు, భార్య, భర్త లేదా ఇతర కుటుంబ సభ్యుల పేర్లు ఉంటే ఆ వివరాలు పొందుపరచాలి. పుట్టిన తేదీ, ఆధార్‌, మొబైల్‌ నంబర్లు, తండ్రి/సంరక్షకుడి పేరు, తల్లి, భార్య, భర్త పేరు, వారి ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్‌) నంబరు నింపాలి. కొత్తగా దిగిన పాస్‌పోర్టు సైజు కలర్‌ ఫొటోలు రెండు ఇవ్వాలి. ఈవిధంగా రెండు పత్రాలు నింపాలి. ఒకటి బీఎల్‌ఓ తీసుకుని, మరో దానిపై సంతకం చేసి ఓటరుకు రసీదుగా అందజేస్తారు. 2002 జాబితాలో ఓటు ఉండి 2025 జాబితాలో లేకపోతే తగిన ధ్రువపత్రం అందిస్తే ఓటుకు ఢోకా ఉండదు. బీఎల్‌ఓ ఇంటిని మూడుసార్లు సందర్శించినప్పటికీ ఓటరు అందుబాటులో లేకపోతే ఇంటికి నోటీసు అతికించి, ఓటు తొలగింపునకు ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అయితే, అందుబాటులో లేని కారణంగా ఏ ఒక్కరి ఓటు హక్కునూ తొలగించేందుకు బీఎల్‌ఓలు ప్రతిపాదించకూడదు. ఆ ఓటరుకు సంబంధించి కుటుంబ సభ్యులు ఎన్నికల కమిషన్‌ సూచించిన 13 ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి చూపించి, వివరాలు చెప్పినా సరిపోతుంది. ఏ కారణం చేతనైనా ఓటును తొలగిస్తే ఫామ్‌–6 ద్వారా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బీఎల్‌ఓ నిష్పక్షపాతంగా ఉండాలి

ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఒక్కో బీఎల్‌ఓ ఉంటారు. రాజకీయ పార్టీలు ప్రతిపాదించిన బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల (బీఎల్‌ఏ) సమక్షంలో బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే చే స్తారు. ఈ క్రమంలో అధికార పక్షం ఒత్తిళ్లకు ఎవరైనా బీఎల్‌ఓలు తలొగ్గితే.. ఆయా పార్టీల బీఎల్‌ఏలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఏవైనా సమస్య లుంటే ఓటర్లు 1950 టోల్‌ ఫ్రీ నంబరుతో పాటు తమ తహసీల్దార్‌ లేదా బీఎల్‌ఓలను సంప్రదించవచ్చు.

అప్రమత్తంగా ఉండాలి

రాజ్యాంగంపై నమ్మకమున్న ఓటర్లు తమ ఓటు హక్కు తొలగిపోదనే విశ్వాసంతో ఉంటారు. సర్‌ ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టాలి. ఓటర్లు సైతం అవగాహనతో, అప్రమత్తంగా వ్యవహరించాలి.

– తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ, మండపేట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement