గోదారి తీరాన..నృత్యఝరులు | - | Sakshi
Sakshi News home page

గోదారి తీరాన..నృత్యఝరులు

Jun 15 2026 12:17 AM | Updated on Jun 15 2026 12:17 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గోదారి తీరాన నృత్య ఝరులు వెల్లివిరిశాయి. నాలుగు రోజులుగా రాజమహేంద్రవరంలోని రివర్‌బే హోటల్‌ ఆహ్వానం ఫంక్షన్‌ హాలులో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం నిర్వహించిన కళాసమ్మేళన్‌–2026 అంతర్జాతీయ సంగీత, నృత్యోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ సంగీత, నృత్య పోటీల్లో దేశంలోని 13 రాష్ట్రాల నుంచి వచ్చిన 750 మంది కళాకారులు 13 గ్రూపులుగా తమ కళాకౌశలాన్ని అద్భుత రీతిలో ప్రదర్శించారు. తొలి రోజైన గురువారం వంద మంది నాట్యకారిణులు నృత్య ప్రదర్శన చేశారు. శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన 175 మంది శుక్రవారం ఉదయం 9 గంటల 9 నిమిషాల 9 సెకన్ల పాటు 108 అన్నమయ్య కీర్తనలకు నృత్యాభినయం చేసి, నృత్యాభిమానుల కరతాళధ్వానాలు అందుకున్నారు. చివరి రోజైన ఆదివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శ్రీపుష్పయాగం వైభవంగా నిర్వహించారు. సనాతన కాలభైరవ వైభవం నృత్యరూపకాన్ని లక్ష్మీదీపిక ఆధ్వర్యాన ప్రదర్శించి, ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం నిర్వాహకుడు జి.బదరీ నారాయణ మాట్లాడుతూ, కూచిపూడి నృత్య వైభవాన్ని నేటి తరం తెలుసుకోవాలనే సంకల్పంతో గతంలో 63 రోజుల పాటు 22 రాష్ట్రాలు, 17 వేల కిలోమీటర్లు ప్రయాణించి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఈ నృత్యాన్ని ప్రదర్శించామని చెప్పారు. కూచిపూడికి పూర్వ వైభవం తీసుకు రావడానికి 2003లో భగీరథ ప్రయత్నం మొదలుపెట్టామని అన్నారు. కళాసమ్మేళన్‌–2026 ద్వారా వందల మంది నృత్యప్రదర్శనలు చేశారని, వీటిని తిలకించి మరికొంత మంది నృత్యం నేర్చుకుంటే తన జన్మ ధన్యమైనట్లేనని అన్నారు.

ముగిసిన అంతర్జాతీయ కళాసమ్మేళన్‌

ప్రతిభ ప్రదర్శించిన 13 గ్రూపులు

శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రానికి

ప్రథమ బహుమతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement