చెరువులను చెరబట్టారు | - | Sakshi
Sakshi News home page

చెరువులను చెరబట్టారు

Jun 15 2026 12:17 AM | Updated on Jun 15 2026 12:17 AM

రంగంపేట: అధికార పార్టీ నాయకులు చెరువులను చెరబట్టారు. వేసవి ప్రారంభమైనప్పటి నుంచి రంగంపేట మండలంలోని పలు గ్రామాల్లో నిత్యం ఏదో ఒక చెరువులో మట్టిని అక్రమంగా తవ్వేస్తూ, ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా సుభద్రంపేట గ్రామంలోని పంతం వారి చెరువు, పెద్ద చెరువుల్లో ఎటువంటి అనుమతులూ లేకుండా జేసీబీలతో మట్టి తవ్వేస్తున్నారు. సుమారు 30 అడుగుల లోతు వరకూ తవ్వేసి, మట్టి తరలించుకుపోతున్నారు. వర్షాలు కురిసి, ఆ అగాధాల్లో నీరు చేరితే స్థానిక రైతులు, పశువుల ప్రాణాలకు ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికై నా స్పందించి మట్టి దోపిడీకి అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

మందకొడిగా

పొగాకు కొనుగోళ్లు

దేవరపల్లి: రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని టొబాకో బోర్డు రీజినల్‌ మేనేజర్‌ జె.సురేంద్ర కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. లో గ్రేడ్‌ పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు ఆసక్తి చూపడం లేదన్నారు. అమ్మకానికి వచ్చిన బేళ్లలో 40 శాతం తిరస్కరిస్తున్నారన్నారు. కిలో పొగాకుకు గరిష్టంగా రూ.265, కనిష్టంగా రూ.179, సగటున రూ.255.98 చొప్పున ధర పలుకుతోందని వివరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 33.01 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయన్నారు. దేవరపల్లి వేలం కేంద్రంలో 2,96,035, జంగారెడ్డిగూడెం–1లో 5,63,013, జంగారెడ్డిగూడెం–2లో 4,31,649, కొయ్యలగూడెంలో 3,54,660, గోపాలపురం వేలం కేంద్రంలో 4,30,362 కిలోల చొప్పున విక్రయాలు జరిగాయని వివరించారు. సుమారు 80 రోజులుగా వేలం ప్రక్రియ జరుగుతోందన్నారు.

ఘనంగా సత్యదేవుని రథసేవ

అన్నవరం: రత్నగిరిపై ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆదివారం ఘనంగా ఊరేగించారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథంపై వేంచేయించారు. అనంతరం, అర్చకులు పూజలు చేసి రథసేవ ప్రారంభించారు. రథం లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల ఘోష నడుమ స్వామి, అమ్మవార్లను రథంపై ఆలయ ప్రాకారంలో మూడుసార్లు ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారిని తిరిగి ఆలయానికి చేర్చారు.

నేడు ప్రత్యంగిర హోమం

అధిక జ్యేష్ట మాస అమావాస్య సందర్భంగా రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి సోమవారం ఉదయం 9 గంటలకు ప్రత్యంగిర హోమం నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.1,116 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement