అన్నవరం: సత్యదేవుని భక్తులకు ఎట్టకేలకు రత్నగిరిపై వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రత్నగిరిపై వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రత్నగిరిపై వైద్య సేవల ఆవశ్యకతను వెలుగులోకి తెచ్చేలా ‘దివ్యక్షేత్రం.. వైద్యం పూజ్యం!’ శీర్షికన ఈ నెల 5న ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించారు. ప్రతి రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ దేవస్థానం వైద్యాధికారి వంశీకృష్ణతో పాటు ఇద్దరు నర్సులలో ఒకరు షిఫ్టుల వారీగా రత్నగిరిపై భక్తులకు సేవలందించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి రావడంతో డాక్టర్ వంశీకృష్ణ, సీనియర్ నర్సు సరోజిని శనివారం రామాలయం ఎదురుగా కార్పొరేట్ ఆసుపత్రికి కేటాయించిన హెల్త్ సెంటర్‌లో సేవలందించారు.
శాశ్వత వైద్యశాల మేలు
రత్నగిరిపై వైద్య సేవలను అందుబాటులోకి తీసుకుని రావడం వరకూ బాగానే ఉన్నప్పటికీ.. ఇక్కడ భక్తులకు 24 గంటలూ అందుబాటులో ఉండేలా శాశ్వత ప్రాతిపదికన ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. వాస్తవానికి భక్తులకు ప్రథమ చికిత్స అందించేందుకు రత్నగిరి రామాలయం ఎదురుగా కార్పొరేట్ ఆసుపత్రికి గది కేటాయించడంపై విమర్శలున్నాయి. కొన్నిసార్లు దేవస్థానంలోనే భక్తులు మృతి చెందుతున్నారు. మరి కొంత మంది ఆసుపత్రికి తరలించగానే మృతి చెందుతున్నారు. దైవదర్శనం తరువాత భక్తులు అక్కడే సేద తీరుతారు. అక్కడే ప్రసాదాల విక్రయ కేంద్రం ఉంది. అటువంటి చోట మృతి చెందిన వారిని తరలించడం కొంత ఇబ్బందితో కూడుకున్న పని. ఇలా జరిగినా ప్రతిసారీ ఆలయ ప్రాంగణంలో సంప్రోక్షణ చేయాల్సి ఉంటుంది. అందువలన ప్రకాష్ సదన్ సత్రం వెనుక ఖాళీ స్థలంలో శాశ్వత ఆసుపత్రి నిర్మిస్తే అటు సత్యగిరి, ఇటు రత్నగిరికి అందుబాటులో ఉంటుందనే అభిప్రాయం వస్తోంది. ఇది ఆలయానికి దూరంగా ఉండటం వలన ఎవరైనా మృతి చెందినా పక్కనే ఉన్న ఘాట్ రోడ్డు ద్వారా దిగువకు తీసుకువెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఇదిలా ఉండగా దేవస్థానం వైద్యుడిని మధ్యాహ్నం వరకూ రత్నగిరిపై పని చేయాలని ఆదేశించడంతో ఆ సమయంలో కొండ దిగువన వైద్య సేవలు అందే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కొండ దిగువన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పని చేసేలా మరో వైద్యుడిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తక్షణ వైద్యం అందించేందుకే..
రత్నగిరిపై భక్తులకు తక్షణ వైద్య సహాయం అందడం లేదు. ఎంత సీరియస్ కేసు అయినా కొండ దిగువ ఆసుపత్రికి తరలించాల్సి వస్తోంది. ఈ క్రమంలో మార్గం మధ్యలోనే ప్రాణం పోతోందన్న విమర్శలున్నాయి. అందువలన తక్షణ వైద్యం అందించేందుకు డాక్టర్, నర్స్‌ను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ దేవస్థానంలో పని చేయాలని ఆదేశించాం. రత్నగిరిపై పర్మినెంట్ ఆసుపత్రి నిర్మించే అంశాన్ని పరిశీలిస్తాం. – నల్లం సూర్య చక్రధరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం


