అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి కిటకిటలాడింది. రెండో శనివారం సెలవు కావడంతో సత్యదేవుని దర్శనానికి భక్తులు వెల్లువలా తరలి వచ్చారు. దూరప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో తరలి రావడంతో పార్కింగ్ స్థలాలన్నీ నిండిపోయాయి. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా కూడా భక్తుల వాహనాలు బారులు తీరడంతో పలుమార్లు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. వ్రతాలు 2,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఆరు వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.
ట్రిపుల్ ఐటీ ప్రవేశాల
జాబితా విడుదల
నూజివీడు: నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2026–27 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు ఎంపికై న అభ్యర్థుల జాబితాను రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) శనివారం విడుదల చేసింది. ప్రత్యేక కేటగిరీ కోటా మినహా 4,040 సీట్లకు ఎంపికై న విద్యార్థుల జాబితాను విడుదల చేశారు. ఎంపికై న వారికి ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకూ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ట్రిపుల్ ఐటీకి కాకినాడ జిల్లా నుంచి 199 మంది, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి 234 మంది, తూర్పు గోదావరి జిల్లా నుంచి 110 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి నలుగురు ఎంపికయ్యారు. కోనసీమ జిల్లా పి.లక్ష్మీవాడ జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని నంద్యాల కార్తిక, గాలిదేవర హర్షిణి సత్యదుర్గ, కాకినాడ జిల్లా తుని జెడ్పీ బాలిక హైస్కూల్ విద్యార్థిని పత్రి హర్షిణి, దాడి భానుక్రాంతి, శంఖవరం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని సైపిరెడ్డి స్వాతి టాప్ టెన్‌లో నిలిచారు.
పర్యాటక బోట్ల రాకపోకలకు
తాత్కాలికంగా బ్రేక్
రంపచోడవరం: గోదావరిలో పర్యాటక బోట్ల నిర్వహణ తీరుపై పలు ఆరోపణలు, భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా వాటి రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. రంపచోడవరం ఆర్‌డీఓ కె.స్వాతి శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. కలెక్టర్ కె.దినేష్ కుమార్ ఆదేశాల మేరకు గోదావరిలో తిరుగుతున్న పర్యాటక బోట్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. వాటి ఫిట్‌నెస్, సాంకేతిక పరిస్థితి, ప్రయాణికుల సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, లైఫ్ జాకెట్లు, అత్యవసర రక్షణ పరికరాలు, పర్యాటకుల భద్రత కోసం తీసుకున్న చర్యలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ, పోలీసు, పర్యాటక, మత్స్యశాఖ, విపత్తు నిర్వహణ, ఇరిగేషన్ శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం ఈ తనిఖీలు నిర్వహిస్తుందన్నారు. ఆ బృందం నివేదిక ఆధారంగా అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్ధారణ అయిన అనంతరం సంబంధిత బోట్లకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని, తనిఖీలు పూర్తయ్యే వరకు గోదావరిలో పర్యాటక బోట్లను నడపరాదని బోట్ యాజమాన్యాలకు ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
‘ఆడబిడ్డ’కు బాబు మంగళం
వైఎస్సార్ సీపీ మహిళా నేతల ధ్వజం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆడబిడ్డ నిధికి నిధులు లేవని తిరుపతి సభలో చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి శనివారం మీడియా సమావేశంలో స్పందించారు. గద్దెనెక్కి రెండేళ్లు దాటిపోతున్నా నిధుల్లేవంటూ యూటర్న్ తీసుకున్న చంద్రబాబు మరో మోసానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టించడం సంగతలా ఉంచితే, అప్పుల్లో చంద్రబాబు ప్రపంచ రికార్డు సృష్టించారని విమర్శించారు. కోట్లాది రూపాయల అప్పులు చేస్తున్నా మహిళలకు కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా, అధికారంలోకి వచ్చాక చెప్పని పథకాలను సైతం అమలు చేసి, మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు. దగా పడిన ఆడబిడ్డకు ఆయన మాత్రమే న్యాయం చేస్తారన్నారు. అబద్ధాలు చెప్పి, మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబుకు ప్రజలు 2029లో బుద్ధి చెప్పి జగన్‌ను అధికారంలోకి తీసుకురావడం ఖాయమని మహిళా నేతలు స్పష్టం చేశారు.


