ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శనివారం సుమారు 80 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో, ఆలయ ప్రాంగణం, క్యూలు కిక్కిరిసిపోయాయి. స్వామివారికి సుప్రభాత సేవ, తొలి హారతి, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాలభోగం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారి దర్శనానంతరం భక్తులు క్షేత్ర పాలకులు శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకున్నారు. భక్తులకు అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు అందించామని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యాన పెద్ద సంఖ్యలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అన్ని విభాగాల ద్వారా స్వామి వారికి రూ.70,71,526 ఆదాయం సమకూరింది.


