రౌతులపూడి: మండల కేంద్రమైన రౌతులపూడి ప్రధాన రహదారిలో మైనింగ్, రవాణా శాఖల సంయుక్తాధ్వర్యంలో రెండో రోజు శనివారం నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు పాటించని 19 క్వారీ లారీలపై కేసులు నమోదు చేశారు. నల్లరాయిని తరలించే భారీ వాహనాలకు సంబంధించి రికార్డులు సక్రమంగా లేకపోవడం, అధిక లోడు, భద్రతా నియమాలు పాటించకపోవడంతో వాటి నుంచి రూ.1.90 లక్షల జరిమానా విధించారు. తనిఖీల్లో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ డి.సోనీప్రియ, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ గౌరీ శంకర్, మైనింగ్ టెక్నికల్ సిబ్బంది సత్యతేజ, రవీంద్ర, కాకినాడ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.
8 మట్టి ట్రాక్టర్లపై కేసులు
అమలాపురం రూరల్: నిబంధనలు పాటించని 8 మట్టి ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి, రూ.38 వేల అపరాధ రుసుం విధించామని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. రెడ్డిపల్లి – కామనగరువు రోడ్డు మార్గంలో తనిఖీలు నిర్వహించామని, ఈ సందర్భంగా మట్టిపై టార్పాలిన్ కప్పకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, రోడ్డు పన్ను ఎగవేత అంశాలపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుపడితే తండ్రి బాధ్యత వహించాలని, రహదారి భద్రతా నియమాల ఉల్లంఘనకు పాల్పడే వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తప్పవని డీటీఓహెచ్చరించారు.
టేబుల్ టెన్నిస్ పోటీల రెండో రోజు విజేతలు
సామర్లకోట: పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి టెబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీల్లో రెండో రోజు శనివారం విజేతల వివరాలను ఆంధ్రప్రదేశ్ టెబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి పి.విశ్వనాథ్ ప్రకటించారు. అండర్ – 11 బాలికల విభాగంలో మిషిక గోవిందరాజు (డీటీటీఎ) ప్రథమ, గీతి ఆప్రోజ్ (ఫన్ టైమ్స్) ద్వితీయ, బాలుర విభాగంలో వీర సాత్విక్ (ఫన్ టైమ్స్) ప్రథమ, పల్లా మహాసవిన్ (ఫన్ టైమ్స్) ద్వితీయ స్థానాల్లో నిలిచారు.
ఫ అండర్ – 13 బాలిక విభాగంలో శ్రీకర లాస్య, కొల్లి హైత్విక (ఫన్ టైమ్స్), బాలుర విభాగంలో జె.వైభవ్, జి.తరుణ్ తేజ (ఫన్‌టైమ్స్) వరుస స్థానాల్లో నిలిచారు.
ఫ అండర్ – 15 విభాగంలో శ్రీకర లాస్య, కొల్లి హైత్విక (ఫన్ టైమ్స్), బాలుర విభాగంలో ఎన్.వేదాంశ్ (ఫన్‌టైమ్స్), నల్ల మోక్షజ్ఞ తేజ (రైజ్) ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ సీహెచ్ విజయ్ ప్రకాష్, కార్యదర్శి విశ్వనాథ్ బహుమతులు అందజేశారు. ఈ పోటీలను నిర్ణీత సమయంలో పూర్తి చేసిన చీఫ్ రిఫరీ సింగరాజు, అసిస్టెంట్ చీఫ్ రిఫరీ డీవైఎస్‌వై శర్మ, ఇతర అంపైర్లను అభినందించారు.


