హోరెత్తిన నినాదాలు
మండపేట పట్టణంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పాలనను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీ సాగింది. రాజారత్నం సెంటర్ లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలువపువ్వు సెంటర్ కేపీ రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మోసాలు సామాన్య ప్రజలకు అర్థమయ్యాయన్నారు. నిరసన కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. కూటమి పాలనను కూకటివేళ్లతో పెకిలించే సమయం ఆసన్నమైందన్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో హామీలు తుంగలో తొక్కి ప్రజలకు వెన్నుపోటు పొడవడంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు నిరసనకు దిగారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మాజీ సీఎం, వైఎస్ జగన్ పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. బాబు పథకాల పేరుతో చేసిన నయవంచనను ఎండగట్టారు. బాబు హామీలను చూపుతూ వినూత్న నిరసనకు దిగారు. ర్యాలీలకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు నాయకులు తరలివచ్చి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.
అడుగడుగునా అడ్డంకులు
చంద్రబాబు వెన్నుపోటుకు నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, పార్టీ శ్రేణులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. కోటగుమ్మం సెంటర్‌లోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నుంచి డీలక్స్ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ శాంతియుతంగా నిర్వహించారు. ర్యాలీ చేపట్టేందుకు వీలు లేదంటూ హెచ్చరిస్తూనే ఒకానొక దశలో అక్కడి నుంచి తోసేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు నిరసనగా పార్టీ నేతలు, మాజీ ఎంపీ భరత్ అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. తన నివాసంలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించి వ్యక్తిగత గదుల వరకు తనిఖీలు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. తన నివాసంలోకి ప్రవేశించిన పోలీసు అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని భరత్ హెచ్చరించారు. సంబంధిత అధికారులపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. నీకు 15.. నీకు 15.. అంటూ మంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అనుసరిస్తూ.. ప్రత్యేకంగా ఓ వ్యక్తిని సైకిల్‌పై తిప్పుతూ నిరసన తెలిపారు. అనంతరం మార్గాని ఎస్టేట్ వద్ద సైకిల్‌ను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం మహిళలు, నిరుద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.వేల కోట్లు ఉన్నాయని భరత్ పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం యువత భవిష్యత్తుతో ఆటలాడటం దారుణమని మండిపడ్డారు.
రెండేళ్ల పాలన సిగ్గుసిగ్గు
చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలన సిగ్గు సిగ్గని, ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జిల్లా పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి అన్నారు. రెండేళ్ల పాలనపై విజయోత్సవాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ జంక్షన్‌లో వేణు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ కోటిపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి మెయిన్‌రోడ్‌లోని పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు వెళ్లి తిరిగి కోటిపల్లి బస్టాండ్ వరకు సాగింది. ర్యాలీకి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు నాయకులు తరలివచ్చి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సుష్క వాగ్దానాలు తప్ప.. చేసింది శూన్యమన్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా బూటకపు హామీలతో డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ డొల్లతనాన్ని ప్రజలు గుర్తించారని, అందుకే వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు.
ప్రభుత్వం సిగ్గుపడాలి
చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అబద్ధమని, రెండేళ్లపాలనపై కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు, లోకేష్ విదేశీ పర్యటనలు చేస్తున్నది దోచుకున్నది దాచుకోవడానికే అన్నట్లు ఉందన్నారు. రెండేళ్ల కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు.
కేసులకు భయపడం
రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని, ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని, అలాంటి వాటికి పార్టీ శ్రేణులు భయపడేది లేదని రాజమండ్రి పార్లమెంటు పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు.
కార్యకర్తల జోలికొస్తే ఉపేక్షించం
అధికార మదంతో కూటమి ప్రభుత్వ నేతలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై చేస్తున్న వేధింపులు మానుకోవాలని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరించారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు‘ కార్యక్రమం ముగింపు సందర్భంగా శుక్రవారం రాజానగరంలో నిర్వహించిన ర్యాలీకి వేలాదిమంది కార్యకర్తలు తరలివచ్చారు. సూర్యారావుపేట–రాజానగరం రహదారి జనసంద్రంగా మారింది. సూర్యారావుపేట దుర్గమ్మ గుడి దగ్గర నుంచి ప్రారంభమైన ర్యాలీ సాయిబాబా ఆలయం, గాంధీబొమ్మ సెంటర్ మీదుగా రాజానగరంలోని వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరింది. కూటమి ఇచ్చిన అబద్ధపు హామీల ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపై అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. అనంతరం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రచారం తారాస్థాయిలో ఉందని, ప్రజలకు చేసింది మాత్రం శూన్యమన్నారు. ఈ దుర్మార్గపు పాలనపై పోరాటం సాగిస్తామన్నారు. కార్యక్రమంలో కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు.
వినూత్న నిరసన
చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసగా అనపర్తిలో వైఎస్సార్ సీపీ శ్రేణులు వినూత్న నిరసనకు దిగారు. చంద్రబాబు ప్రకటించిన పథకాలు ఇవ్వకుండా చేస్తున్న మోసంపై పథకాల ప్లకార్డులు చేతబట్టుకుని రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో భౌతికదాడులు, ఆస్తుల ధ్వంసం, హత్యలు, కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
పథకాల పేరుతో నయవంచన
వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో కొవ్వూరులో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. తొలుత పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవిహార్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు నిర్వహించారు. ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి చేస్తున్న అక్రమాలపై ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తలారి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు ప్రజలకు తీరని మోసం చేశారని మండిపడ్డారు. వృద్ధులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలను నయవంచనకు గురి చేశారని దుయ్యబట్టారు. పాలన ఇలాగే సాగితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
గోపాలపురంలో నిరసన
నియోజకవర్గం నల్లజర్లలో మాజీ హోం మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్ బంక్ నుంచి మండల పార్టీ కార్యాలయం నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన జరిగింది. ప్లకార్డులు చేతపట్టి చంద్రబాబు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి వనిత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తామని నమ్మబలికి మోసం చేశారని ఆరోపించారు. బాబు రెండేళ్ల పాలనలో మహిళలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు.
హోరెత్తిన నిరసన ర్యాలీ
కూటమి ప్రభుత్వ దగాను నిరసిస్తూ నిడదవోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ జి.శ్రీనివాసులు నాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు కదం తొక్కారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నుంచి ప్రారంభమైన ర్యాలీ నంగాలమ్మ గుడి యాదవుల వీధి ఓవర్ బ్రిడ్జి సెంటర్ గణేశ సెంటర్ మీదగా తిరిగి పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం అని చెప్పి దగా చేశారన్నారు. 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని మోసం చేశారని విమర్శించారు.
జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు
వైఎస్సార్ సీపీ పిలుపునకు భారీ స్పందన
రాజానగరంలో అర్ధనగ్న ప్రదర్శన
అనపర్తిలో వినూత్న నిరసన
జనసంద్రమైన రాజానగరం, మండపేట


