● తొలిరోజు 50 శాతం హాజరు
● విద్యార్థులకు అందని పుస్తకాలు
● గొడౌన్లకు ఉపాధ్యాయుల పరుగు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కాగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు 50 శాతం హాజరయ్యారు. తరగతుల ప్రారంభం రోజే ఇవ్వాల్సిన పాఠ్య పుస్తకాలను విద్యాశాఖాధికారులు ఇంకా తీసుకురాలేదు. హైస్కూళ్లకు ఇప్పటికే అందజేసినా, ప్రాధమిక పాఠశాలలకు ఇంకా అందజేయలేదు. దీంతో ఉపాధ్యాయులు తరగతులు పక్కన పెట్టి గొడౌన్లకు పరుగులెడుతున్నారు. కాగా పాఠశాలలు తెరిచిన తొలిరోజు తూతూ మంత్రంగా కొన్ని పాఠశాలల్లో పుస్తకాలను పంపిణీ చేసారు. ఇక యూనిఫాం, స్కూలు బ్యాగులు, షూస్ మాటే లేదు. అవి ఇంకా గొడౌన్ వరకూ రాలేదు. అవి చేరడానికి ఇంకా 10 నుంచి 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 1,126 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో 843 ప్రాథమిక పాఠశాలలు, 44 ప్రాధమికోన్నత పాఠశాలలు, 261 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 93,849 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పటికీ, విద్యా సంవత్సరం ప్రారంభానికి అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు పూర్తికాకపోవడంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ముందుగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేసి, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేసేలా విద్యాశాఖ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సర్‌లో బీఎల్‌ఓల పాత్ర కీలకం
కలెక్టర్ కీర్తి చేకూరి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సర్ ప్రక్రియలో బీఎల్‌ఓల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. రాజమహేంద్రవరం రూరల్, అర్బన్ ప్రాంతాల బీఎల్వోల కోసం శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మార్గనిర్దేశం చేశారు. జేసీ మేఘా స్వరూప్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్ రెడ్డి, సహాయ రిటర్నింగ్ అధికారి (రూరల్ తహసీల్దార్) శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్‌ను ఎంత సమగ్రంగా నిర్వహిస్తే, అంత తక్కువ సంఖ్యలో క్లెయిములు, అభ్యంతరాలు వస్తాయని తెలిపారు.
ప్రతి బీఎల్వో తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఓటర్ల వివరాలను ధ్రువీకరించాలని సూచించారు. డోర్ లాక్ ఉన్న ఇళ్ల వద్ద నోటీసులు జారీ చేయడంతో పాటు, తదుపరి సందర్శన తేదీని తెలియజేయాలని, ఆ నోటీసులో ఈఆర్వో, ఏఈఆర్వో, బీఎల్వో ఫోన్ నంబర్లు కూడా పొందుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. సూపర్‌వైజర్లు నిరంతరం పర్యవేక్షించి, ఎన్యుమరేషన్ ప్రక్రియ నాణ్యతను నిర్ధారించాలని స్పష్టం చేశారు. జేసీ మేఘస్వరూప్ మాట్లాడుతూ జిల్లాలో జనాభా పెరుగుదల, వలసల వల్ల ఓటర్ల వివరాల్లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


