సంక్షేమానికి బాటలు పరచిన పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి బాటలు పరచిన పాదయాత్ర

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

నేడు ఉమ్మడి జిల్లాలోకి అడుగుపెట్టిన రోజు

మరపురాని ఆ అరుదైన జ్ఞాపకాలు

కపిలేశ్వరపురం: నడుస్తున్న చరిత్రలో లిఖించదగిన అరుదైన ఘటనల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఒకటి. జనం చూపిన మార్గంలో పయనించాలన్న సంకల్పం నుంచి వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. 2017 నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభమై 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ సాగి విజయవంతంగా ముగిసింది. అంతటి మహాయాత్ర 2018 జూన్‌ 12న అప్పటి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి మీదుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోకి అడుగు పెట్టింది. గోదారమ్మ చలవతో యాత్ర విజయవంతమై, ఆగస్టు 14న విశాఖ జిల్లా మీదుగా ముందుకు సాగింది.

అడుగడుగునా నీరాజనం

పాదయాత్ర 187వ రోజైన 2018 జూన్‌ 12న పశ్చిమ నుంచి గోదావరిపై రోడ్‌ కం రైల్‌ బ్రిడ్జి బీదుగా పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. పశ్చిమలో వీడ్కోలు, తూర్పులో స్వాగత కార్యక్రమాలు వంతెనపై జననేతతో అడుగులో అడుగేస్తూ ముందుకు సాగిన అశేష జనంతో గోదావరి ప్రాంతం పులకించింది. జనం తాకిడికి బ్రిడ్జి పలుమార్లు ఊగడంతో అప్పట్లో టీడీపీ ప్రభుత్వం గుండెల్లో ప్రకంపనలు కలిగాయంటూ అభిమానులు చమత్కరించారు. గోదావరి వెంబడి 600 పడవలు ఆకర్షణీయంగా నిలిచాయి. 13న కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది. బొబ్బర్లంక– రావులపాలెం రహదారి జనగోదావరిలా మారింది. యానాం, ధవళేశ్వరం తదితర వంతెనలు ఆకర్షణీయంగా మారాయి. బొబ్బర్లంక– రావులపాలెం రహదారి వెంబడి కాలువలో నవరత్నాల నావలు ఆకట్టుకున్నాయి. జగన్‌ హృదయంలోంచి జనం వెళ్లేటట్టుగా కాకినాడ రూరల్‌, తునిలలో ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారం విశేషంగా ఆకట్టుకుంది. కోనసీమ కడలిలో కొబ్బరి కమ్మలు, కాయలు, పలు ప్రాంతాల్లో ధాన్యం గుత్తులతో ఘన స్వాగతం పలికారు. అమలాపురం, రౌతులపూడి మండలం గిడజాం, ఎస్‌.అగ్రహారం తదితర ప్రాంతాల్లో పూలతో స్వాగతం ఎంతో ఆకట్టుకుంది. ప్రత్తిపాడు నియోజకవర్గం పారుపాక క్రాస్‌ వద్ద ఆదివాసీయుల దినోత్సవం సందర్భంగా గిరిజనులు కొమ్ము తలపాగను జగన్‌కు ఇవ్వగా ధరించారు. ఆగస్టు 14న విశాఖ జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించింది.

అప్పటి దుష్టపాలనలో చెప్పుకొన్న సమస్యలనేకం

అప్పటి చంద్రబాబు ప్రభుత్వ పాలనతో తాము ఎలా సతమతమవుతున్నామో సామాన్య జనం వైఎస్‌ జగన్‌ వద్ద చెప్పుకొన్నారు. నిలువ నీడ లేకున్నా ఇళ్ల స్థలం ఇవ్వడం లేదని, వైకల్యం కళ్లకు కనిపిస్తున్నా పింఛను ఇచ్చేందుకు కనికరం చూపడం లేదని, తమను ఆదరించడం లేదని అనేక వృత్తిదారులు సమస్యలు చెప్పుకొన్నారు. తమ కుటీర పరిశ్రమలు నిర్వహణ కష్టమవుతుందని పలు ప్రాంతాల్లో నిర్వాహకులు తమ గోడు వెల్లబోసుకున్నారు. జీఎస్టీ వర్తింపు వల్ల తీవ్రంగా నష్టపోతున్నామంటూ నార్కెడిమిల్లిలో పచ్చళ్ల తయారీ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనోపాధిని సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయంటూ ఆత్రేయపురంలో పూతరేకుల వ్యాపారులు అన్నారు. వీరవరంలో బెల్లం తయారీ వ్యాపారులు, చెరుకు రైతులు తమ సమస్యలను చెప్పుకొన్నారు. తలసేమియా, మోకాలు, జీర్ణ వ్యవస్థ ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్న వారు జగన్‌ను కలిశారు.

భరోసాగా నిలిచి..

జనం విన్నపాలే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మ్యానిఫెస్టోగా రూపాంతరం చెందాయి. రెండే రెండు పేజీలతో మొత్తం నవ్యాంధ్ర ప్రదేశ్‌ పేద, మధ్య తరగతి ప్రజలకు ఆశా జ్యోతిగా, భరోసాగా మ్యానిఫెస్టో నిలిచింది. ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మ్యానిఫెస్టోను పరిపూర్ణంగా అమలు చేసి దేశాన్ని ఆంధ్రప్రదేశ్‌ పాలన వైపు దృష్టి సారించేలా చేసింది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా విపత్కర పరిస్థితులను సైతం అధిగమించి ఖర్చుకు వెనకాడకుండా పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమాన్ని అందించిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుంది. అంతటి ఽధైర్యాన్ని ఇచ్చింది ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement