వేమగిరి జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

వేమగిరి జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

– భార్య మృతి, భర్తకు గాయాలు

కడియం: మండలంలోని వేమగిరి వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త గాయాలపాలవ్వడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కడియం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో వెంకాయమ్మపేట గ్రామానికి చెందిన పసుమర్తి శ్రీనివాసరావు, మంగతాయారు (50) మోటారు సైకిల్‌పై రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో రావులపాలెం వైపు నుంచి అరటికాయల లోడుతో కటక్‌ వెళుతున్న వ్యాన్‌ వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న మంగతాయారు తలమీదుగా వ్యాన్‌ చక్రాలు వెళ్లిపోవడంతో తల మొత్తం ఛిద్రమైపోయి, ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. శ్రీనివాసరావు కాలితో సహా పలు శరీర భాగాలపై గాయాలయ్యాయి. అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నారని పోలీస్‌లు తెలిపారు. యమునా పుష్కరాల నుంచి గురువారమే భార్యాభర్తలిద్దరూ ఇంటికి చేరుకున్నారని, గురువారం బ్యాంకు పని నిమిత్తం రాజమహేంద్రవరం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని బంధువులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుప్రతికి తరలించి కడియం ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రూ.25 లక్షలు కాజేసిన

సహోద్యోగిపై కేసు

అనపర్తి: తమను నమ్మించి రూ.25 లక్షలు కాజేసిన సహోద్యోగిపై చర్యలు తీసుకుని, డబ్బును వాపసు ఇప్పించాలని కోరుతూ అనపర్తికి చెందిన ఇద్దరు యువకులు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు గురువారం తెలిపారు. అనపర్తి గ్రామానికి చెందిన జంపా వెంకట సుభాష్‌, వైరాల చిరంజీవి స్థానికంగా ఉన్న ఒక ప్రయివేటు బ్యాంకులో లోన్‌ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. వీరు బంగారు రుణాల టేకోవర్‌ లావాదేవీల కోసం రాజశేఖర్‌రెడ్డి, స్వామిశేఖర్‌రెడ్డిల వద్ద డబ్బు అప్పుగా తీసుకుని, ముందుగా మాట్లాడుకున్న ప్రకారం వడ్డీతో తిరిగి చెల్లిస్తూ వచ్చేవారు. ఇదిలా ఉండగా 2026 జనవరిలో వారి టీమ్‌ లీడర్‌గా చేరిన కొక్కిరిమెట్ల వెంకట రామకృష్ణ రామచంద్రపురంలోని ముత్తూట్‌ బ్రాంచ్‌లో రూ.24 లక్షల విలువైన గోల్డ్‌ లోన్‌ ఉందని, అది క్లియర్‌ చేసి తమ బ్యాంకుకు బదిలీ చేస్తే లాభం వస్తుందని వారిని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన ఫిర్యాదుదారులు, రాజశేఖర్‌రెడ్డి, అతని సహచరుల ద్వారా విడతల వారీగా మొత్తం రూ.24,58,000ను రామకృష్ణకు అందజేశారు. కొన్ని రోజుల తరువాత తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు, రామకృష్ణ మరుసటి రోజే గోల్డ్‌ లోన్‌ను తమ బ్యాంకులో తాకట్టు పెట్టి మొత్తం బకాయిని చెల్లిస్తానని, అదనంగా వచ్చిన లక్ష రూపాయల లాభాన్ని అందరికీ పంచుతానని హామీ ఇచ్చాడు. కనీసం వడ్డీ అయినా జమ వేయమని కోరగా తన ఫోన్‌పే ఖాతాలో రూ.30,000 మాత్రమే ఉన్నాయని చెప్పి ఆ మొత్తాన్ని చిరంజీవి ఖాతాకు బదిలీ చేశాడు. నగదు రూపంలో మరో రూ.28,000 ఇవ్వగా ఆ మొత్తాన్ని స్వామి శేఖర్‌రెడ్డికి చెల్లించారు. మిగిలిన మొత్తం ఇవ్వడానికి కాలయాపన చేస్తూ వచ్చాడు. అనంతరం రామకృష్ణ పరారైనట్లు అతని బావమరిది ద్వారా ఫిర్యాదుదారులకు తెలిసింది. కొంతకాలం తర్వాత రామకృష్ణ తాను క్రికెట్‌ బెట్టింగ్‌లో డబ్బంతా పోగొట్టుకున్నానని, అందువల్ల డబ్బు తిరిగి చెల్లించలేనని చెప్పడమే కాకుండా తమను బెదిరించాడని బాధితులు పేర్కొన్నారు. తమను మోసం చేసిన రామకృష్ణ, అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకొని, న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఇచ్చిన ఫిర్యాదుపై అనపర్తి పోలీసులు కేసు నమోదు చేశారు.

‘రంపచోడవరం’ పరిశీలకుడిగా

పాపారాయుడు

కపిలేశ్వరపురం: పోలవరం జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్‌ సీపీ పరిశీలకులుగా తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అర్తమూరు గ్రామానికి చెందిన కర్రి పాపారాయుడు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ప్రకటన వెలువడింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement