అభివృద్ధి పనులన్నీ మా హయాంలోనివే | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులన్నీ మా హయాంలోనివే

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

రెండేళ్లలో ఒక్క కొత్త అభివృద్ధి

కార్యక్రమం చూపలేని ప్రభుత్వం

మాజీ ఎంపీ భరత్‌రామ్‌

రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం ఇండోర్‌ స్టేడియం, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి పూర్తిగా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ కృషి ఫలితమేనని వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. రాజమహేంద్రవరంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖేలో ఇండియా పథకం ద్వారా మంజూరైన 13 కోట్ల రూపాయలను కూటమి నేతలు తమ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో నిరంతరం సమన్వయం చేస్తూ గత ప్రభుత్వ హయాంలోనే 58 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఆమోదాలు తెచ్చామన్నారు. రెండేళ్లుగా ఇండోర్‌ స్టేడియం అభివృద్ధి పనులు చేయకుండా నిర్లక్ష్యం చేసిన నేతలు ఇప్పుడు క్రెడిట్‌ కోసం పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. మోరంపూడి ఫ్లైఓవర్‌ సర్వీస్‌ రోడ్ల నిర్మాణం పూర్తి చేయలేని ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఫ్లై ఓవర్లు, రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ, ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు, నిధులు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలోనే తాను ఎంపీగా ఉన్న సమయంలో తీసుకొచ్చానన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో రాజమహేంద్రవరంలో కొత్తగా ఒక్క ప్రధాన అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదన్నారు. విద్యుత్‌ ట్రానన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినా ప్రచార ఆర్భాటం చేసుకోవడం స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకు అలవాటుగా మారిందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎంతో హడావుడిగా ప్రారంభించిన ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ప్రాజెక్టు ఘోరంగా విఫలమైందని, దానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి గత రెండేళ్లలో రాజమహేంద్రవరం అభివృద్ధికి చేసిన కృషి ఏమిటో ప్రజలకు వివరించాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రచారాలతో కాలం గడుపుతోందని, కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజల తీర్పు కూటమి ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెబుతుందని మార్గాని భరత్‌రామ్‌ హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement