అనపర్తి: తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దుండగులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పి విద్య వివరాలు వెల్లడించారు. బిక్కవోలులోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో పాటు నగదు చోరీ అయ్యిందని వచ్చిన సమాచారంతో రెండు టీములు ఏర్పాటు చేసి విచారణ చేపట్టామన్నారు. కేసు విచారణలో ఉండగా బలబద్రపురంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా బిక్కవోలులో చోరీ చేసింది వారేనని గుర్తించారన్నారు. బిక్కవోలుతో పాటు మండపేట, జగ్గంపేట పిఠాపురం పరిసరాలలో ఏడు చోరీలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు వారి నుంచి రూ.27,13,620 విలువైన బంగారు ఆభరణాలు, రూ.2,59,720 విలువైన వెండి వస్తువులు, రూ.2.5 లక్షల నగదు మొత్తం రూ.32,23,360 విలువైన సొత్తు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులు కాకినాడకు చెందిన సుంకర తేజ, టేకుమూడి శ్రీకాంత్, పెద్దపురానికి చెందిన మర్రి స్వామికుమార్ అలియాస్ శ్యామ్‌గా గుర్తించామన్నారు.
రూ.32,23,360 విలువైన సొత్తు, నగదు స్వాధీనం


