నియోజకవర్గ జనసేనలో ఆధిపత్య పోరు తరాస్థాయికి చేరింది. కొంత కాలంగా అంతర్గతంగా ఉన్న విభేదాలు గ్రామ కమిటీ నియామకంతో భగ్గుమన్నాయి. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డి.సువర్ణరాజు, నియోజకవర్గ నేత దిరిసిన ఫాతిమా రాణిల మధ్య వర్గపోరు నెలకొంది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో సువర్ణరాజు వ్యవహరిస్తున్న తీరు స్వపక్షీయులకు మింగుడు పడడం లేదు. పార్టీ కోసం ఆది నుంచీ శ్రమించినవారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తుండడంపై వారు గుర్రుగా ఉన్నారు.
అగ్గి రాజేసిన ఇన్‌చార్జి పదవి?
ఏడాది క్రితం జనసేనలో చేరిన దేవరపల్లి మండలం గౌరీపట్నానికి చెందిన దిరిసిన ఫాతిమా రాణికి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కట్టబెట్టేందుకు పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇది ఆమెకు, సువర్ణరాజుకు మధ్య ఆధిపత్యపోరుకు కారణమైందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల దేవరపల్లి గ్రామ కమిటీ నియామకంతో ఇవి బట్టబయలయ్యాయి. 2025 అక్టోబర్‌లో వచ్చిన మోంథా తుపాను బాధితుల కోసం సువర్ణరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో భారీగా సేకరించిన బియ్యాన్ని పంపిణీ చేయకపోవడంతో అవికాస్తా పాడైపోయాయి. వాటని సుమారు రూ.15 లక్షలకు విక్రయించారు. ఆ సొమ్మును సకాలంలో ప్రభుత్వానికి అందజేయకపోవడంతో సువర్ణరాజు కార్యకర్తల నుంచి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనంతరం బియ్యం సొమ్మును సువర్ణరాజు ప్రభుత్వానికి అందజేశారు.
దిరిసిన ఫాతిమారాణి, జనసేన నాయకురాలు, గౌరీపట్నం
సువర్ణరాజు,
నియోజకవర్గ ఇన్‌చార్జి, దేవరపల్లి


