సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో తీవ్ర అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని రాష్ట్ర సబ్ ఆర్డినేట్ కమిటీ చైర్మన్, వైఎస్సార్ సీపీ మండపేట కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. ప్రధానంగా డీలర్ల వద్దకు వెళ్లకుండానే రేషన్ బియాన్ని పక్కా దారి పట్టిస్తున్నారన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా పౌర సరఫరాల అధికారి సమన్వయకర్తగా వి.పార్వతి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ తొలి సమావేశానికి జేసీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ పౌర సరఫరా శాఖ అధికారులు మామూళ్ల మత్తులో నిద్రపోతున్నారని ఆరోపించారు. ఎంఎస్‌ఓల కనుసన్నల్లో ఈ కోటా బియ్యం వ్యాపారం సాగుతోందని దుయ్యబట్టారు. అంగన్‌వాడీ సెంటర్లలో గర్భిణులకు, పిల్లలకు ఇచ్చే పౌష్టికాహార వివరాలను ప్రదర్శించాలన్నారు. కొత్తగా తీసుకొచ్చిన రేషన్ పాలసీలో హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి సుదూర ప్రాంతాలకు వృత్తిరీత్యా వెళ్లిన లబ్ధిదారుల రేషన్ సరకులను కూటమి నేతల సహకారంతో పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఇప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిందో పూర్తి వివరాలు తెలపాలని కోరారు. జేసీ వై.మేఘాస్వరూప్ మాట్లాడుతూ నిబంధనల ఉల్లంఘనలు, అవకతవకలు గమనిస్తే జిల్లా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 1952 ద్వారా,1100 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ఆహార భద్రతకు సంబంధించి 2025లో 445 అర్జీలు రాగా వాటిని పరిష్కరించామని, 2026లో ఇప్పటి వరకు 80 అర్జీలు స్వీకరించగా 75 పరిష్కరించినట్టు తెలిపారు. ఆహార భద్రతతో పాటు పోషక భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డీఎస్‌వో వి.పార్వతీ పేర్కొన్నారు. జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు సలాది ఉదయ భాస్కరరావు, గొట్టిముక్కల అనంతరావు మాట్లాడారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవోలు ఆర్.శివరాముడు, కె.ఆనందరావు పాల్గొన్నారు.
విజిలెన్స్ సమావేశంలో రాష్ట్ర సబ్
ఆర్డినేట్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు


