కపిలేశ్వరపురం (మండపేట): విశాఖ స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాపులో మెటల్ లిక్విడ్ లాడిల్ పేలుడు ఘటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ఘటన పట్ల మంగళవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది కార్మికులు సజీవ దహనం కావడం, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలవడం తనను కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనల కారణంగా ప్రమాదం జరిగిందన్నారు. కర్మాగారంలో సరిపడా కార్మికులు ఉండాలని, వారికి తగిన రక్షణ, ఆర్థిక, సామాజిక అవసరాలు తీర్చగలిగే సదుపాయాలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి వాటిని ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. అమాయక కార్మికుల ప్రాణాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నత స్థాయి కమిటీతో వెంటనే విచారణ జరపాలని, చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాయపడినవారు పూర్తిగా కోలుకునేవరకూ మెరుగైన చికిత్స అందించాలన్నారు.
అధ్యాపక పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో అధ్యాపక నియామకాలకు ఆసక్తి, అర్హత ఉన్నవారు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చని రిజిస్టార్ ఆచార్య కేవీ స్వామి మంగళవారం తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అనంతరం హార్డ్ కాపీలను కూడా ఈ నెల 22లోగా రిజిస్టార్ కార్యాలయానికి పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపాలన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని పరిశీలించాలని సూచించారు.
వివాదాస్పద ‘దేవాన్ష్ ఘాట్’
బోర్డు తొలగింపు
సీతానగరం: మండలంలోని మునికూడలి వద్ద గోదావరి తీరాన గల చారిత్రాత్మక శ్రీ అఖండ గౌతమి గోదావరి స్నాన ఘటం పేరును మార్చి ఏర్పాటు చేసిన దేవాన్ష్ ఘాట్ బోర్డును అధికారులు ఎట్టకేలకు తొలగించారు. 2015 పుష్కరాల సమయంలో సీఎం మనవడు దేవాన్ష్ పేరును ఈ ఘాట్‌కు పెడుతూ బోర్డు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధి అత్యుత్సాహంతో దేవాన్ష్ ఘాట్ సోషల్ మీడియాలో వైరల్ అయి వివాదాస్పదం కావడంతో అధికారులు మునికూడలి ఘాట్‌లో దేవాన్ష్ ఘాట్ బోర్డును తొలగించారు.


