బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): హరిత వాతావరణ నిధి (జీసీఎఫ్) లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో మడ అడవుల విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా అటవీ అధికారి ఎన్.రామచంద్రరావు, రెవెన్యూ, మత్స్య, డీఆర్‌డీఏ తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఏడాది కొత్తగా మరో 115 హెక్టార్లలో మడ అడవుల పెంపకం చేపట్టాలని, దీంతో పాటు గతంలో 180.58 హెక్టార్లలో పునరుద్ధరించిన అడవుల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. తీరప్రాంత పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్యకారులు, వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంయుక్త సహకారంతో జీసీఎఫ్ నిధులతో కోరింగ వన్యప్రాణి అభయారణ్యం, పరిసర తీర ప్రాంత గ్రామాల్లో చేపడుతున్న వివిధ వాతావరణ అనుకూల అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి సాధించిన ఫలితాలను అధికారులు వివరించారు. జిల్లాలో మడ అడవుల పునరుద్ధరణ, జీవనోపాధి రంగాల్లో గణనీయమైన ప్రగతి నమోదైందని రామచంద్రరావు తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ టి.తిప్పేనాయక్ తదితరులు పాల్గొన్నారు.


