పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకారులను
నెట్టివేస్తున్న పోలీసులు
సాక్షి, రాజమహేంద్రవరం/రంగంపేట: వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వారిని చిత్రహింసలు పెట్టారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణలు.. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల నిరసనలు.. టీడీపీ నాయకుల కవ్వింపు చర్యలతో రంగంపేటలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
కూటమి కుట్రలతో..
రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలోని ఫిషర్‌మెన్ సొసైటీలో 270 మంది సభ్యులున్నారు. ఈ సంఘం ఎన్నికలకు గత మార్చి 5న అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. సొసైటీలో వైఎస్సార్ సీపీకే మెజారిటీ ఉండటంతో ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన కూటమి నేతలు కుట్రలకు తెర తీశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నికను గతంలో వాయిదా వేయించారు. దీనిపై వైఎస్సార్ సీపీ మత్స్యకార సంఘం నాయకులు కోర్టును ఆశ్రయించగా రెండు వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని తీర్చు వచ్చింది. ఈ మేరకు ఈ నెల 29న ఎన్నిక జరగాల్సి ఉంది.
కిడ్నాప్ కేసు నమోదైందని..
దొడ్డిగుంట గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలు మడికి లక్ష్మి భర్త, ఆ పార్టీ దళిత నేత మడికి వెంకట్రావు, మరో బీసీ నేత చెల్లుబోయిన వీరబాబులు వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. వీరు ఫిషర్‌మెన్ సొసైటీ ఎన్నికల్లో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి ఇళ్లకు రంగంపేట పోలీసులు శుక్రవారం ఉదయం వెళ్లి, వారిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. కూటమి మద్దతుదారులైన గుత్తుల యేసు, విత్తనాల భూరయ్య భార్యలతో వెంకట్రావు, వీరబాబులపై కిడ్నాప్ కేసు నమోదు చేయించారు. వెంకట్రావు, వీరబాబులను పోలీసులు చిత్రహింసలకు గురి చేసినట్లు వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
పోలీసుల బుకాయింపు
వెంకట్రావు, వీరబాబులను పోలీసులు తీసుకెళ్లిన సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆ పార్టీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి తదితరులు రంగంపేట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తమ వాళ్లను ఎక్కడ నిర్బంధించారో చెప్పాలని, వారిని వెంటనే క్షేమంగా అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే, పోలీసులు బుకాయించారు. తాము ఎవ్వరినీ తీసుకు రాలేదని రాజాతో అనపర్తి సీఐ సుమంత్ వాగ్వాదానికి దిగారు. ఆ సందర్భంగా సీఐ, రాజాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. సీఐ తనను బెదిరించే ధోరణిలో మాట్లాడటంతో రాజా సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. వెంకట్రావు, వీరబాబులను పోలీసులు తీసుకెళ్లిన దృశ్యాలు వెంకట్రావు ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు తీసుకువచ్చిన తమ పార్టీ నేతలను వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రాజా, సూర్యనారాయణరెడ్డిలు వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి ఏడీబీ రోడ్డుపై బైఠాయించారు. వాద్దరినీ తమకు చూపించేంత వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేస్తూ.. ఎర్రటి ఎండలోనే మొక్కవోని పట్టుదలతో ఆందోళన నిర్వహించారు. కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారమూ లేకుండా ఒక దళితుడిని అక్రమంగా నిర్బంధించడాన్ని తప్పుబట్టారు.
టీడీపీ కవ్వింపు చర్యలు
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ ఆందోళనకు పోటీగా టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుయి, టీడీపీ జిందాబాద్ అంటూ నినదిస్తూ కవ్వించేందుకు, వైఎస్సార్ సీపీ శ్రేణుల పైకి దూసుకుని వచ్చి దుర్భాషలాడుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఇరు పక్షాలకూ పోలీసులు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.
రాత్రి వరకూ ఆందోళన
వెంకట్రావు, వీరబాబులను రహస్య ప్రదేశంలో దాచి పోలీసులు మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశారు. స్టేషన్ వద్ద పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. సాయంత్రం వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మరో మాజీ మంత్రి, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ హోం మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, యువజన నేత జక్కంపూడి గణేష్ తదితరులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. డీఎస్పీ విద్యతో చర్చలు జరిపారు. పోలీసులు తీసుకొచ్చిన మడికి వెంకట్రావు, చెల్లుబోయిన వీరబాబులు తమ వద్దే ఉన్నారని, వారిని కిడ్నాప్ కేసులో అరెస్టు చేశామని, రాత్రి పెద్దాపురం కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ చెప్పారు. తమ వారిని కొట్టినట్లు తెలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నేతలు హెచ్చరించారు. కోర్టులో హాజరు పరిచేంత వరకూ అక్కడే ఉంటామని స్టేషన్ వద్ద బైఠాయించారు. కార్యక్రమంలో పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి దుర్గారావు, జెడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
అనపర్తిలో ఆటవిక పాలన
రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయి. కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా విఫలమైంది. అనపర్తి నియోజకవర్గంలో ఆటవిక పాలన సాగుతోంది. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరంకుశత్వంతో పాలన సాగిస్తున్నారు.
– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు
గెలిచే దమ్ము లేక..
ఫిషర్‌మెన్ సొసైటీ ఎన్నికల్లో నేరుగా పోటీ చేసి గెలిచే దమ్ము లేక అధికార పార్టీ నాయకులు ఏదో ఒక రకంగా వైఎస్సార్ సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. స్వయంగా దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలి భర్తను అన్యాయంగా స్టేషన్‌కు తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. వారి మీద అన్యాయంగా చేయి చేసుకున్నారని తేలితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.
– జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
టీడీపీకి కొమ్ము
కాస్తున్న పోలీసులు
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రభుత్వానికి సొంత పార్టీ కార్యకర్తలా పని చేస్తోంది. టీడీపీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారు. అక్రమ నిర్బంధం విషయంలో న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం.
– తానేటి వనిత, మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్
అరాచకానికి కేరాఫ్ అనపర్తి
అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా అనపర్తి నియోజకవర్గం మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాడులు, దౌర్జన్యాలు పెరిపోయాయి. ఆస్తుల ధ్వంసం వంటి అనేక దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని రాజకీయాలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్నారు.
దొడ్డిగుంట ఫిషర్‌మెన్ సొసైటీ ఎన్నికల్లో గెలవలేమని, ఏదో రకంగా వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేసి, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వాళ్లు లేకుండా చేసి, దొడ్డిదారిన ఎలక్షన్‌లో గెలవాలని చూస్తున్నారు. రామకృష్ణారెడ్డికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారు.
– డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి,
వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్
ప్రజాస్వామ్యం ఉందా?
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దళితులపై దాడులు పెరిగిపోయాయి. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట దాడులు చేస్తూనే ఉన్నారు. ఫిషర్‌మెన్ ఎన్నికల్లో క్రియాశీలకంగా ఉన్న దళిత నేతను అక్రమంగా నిర్బంధించడం దారుణం. చంద్రబాబుకు దళితులంటే ఇష్టం ఉండదు. అందుకే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
– తలారి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ
కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్
దిగివచ్చిన పోలీసులు
వైఎస్సార్ సీపీ నేతల నిరవధిక ఆందోళనతో పోలీసులు ఎట్టకేలకు దిగివచ్చారు. తాము అక్రమంగా నిర్బంధించిన వెంకట్రావు, వీరబాబులు తమ వద్దనే ఉన్నారని ఒప్పుకొని, కిడ్నాప్ కేసులో అరెస్టు చేస్తున్నట్లు రాత్రి తెలిపారు. పెద్దాపురం కోర్టులో హాజరు పరిచేందుకు ప్రయత్నించగా.. శనివారం తీసుకురావాలని న్యాయమూర్తి జి.బుల్లెమ్మ ఆదేశించారని చెప్పారు. దీంతో, వెంకట్రావు, వీరబాబులను రాత్రి అనపర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాత్రంతా వారిని అక్కడే పోలీసు కస్టడీలో ఉంచి, వారిని శనివారం పెద్దాపురం కోర్టులో హాజరుపరచనున్నారు. వెంకట్రావు, వీరబాబులను పోలీసులు చూపించడంతో వైఎస్సార్ సీపీ నేతలు శుక్రవారం రాత్రి ఆందోళన విరమించారు.
న్యాయం కావాలి
దొడ్డిగుంటలోని మా ఇంటికి శుక్రవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో పోలీసులు వచ్చారు. ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే నా భర్త వెంకట్రావుపై కిడ్నాప్ కేసు నమోదైందని, పోలీసు స్టేషన్‌కు రావాలని చెప్పారు. దీంతో, మా అల్లుడితో కలిసి నా భర్త వెంకట్రావును పోలీసులతో పంపించాం. తీరా స్టేషన్‌కు తీసుకెళ్లిన తరువాత నా భర్తను పోలీసులు కొట్టి, చిత్రహింసలు పెడుతున్నారని మా అల్లుడు చెప్పారు. ఈ విషయాన్ని పెద్దలకు, జెడ్పీటీసీ సభ్యుడు రాంబాబుకు చెప్పి, పోలీస్ స్టేషన్ వచ్చాం. ‘నా భర్త ఎక్కడ’ అని పోలీసులను అడిగితే, ‘మీ భర్తను మేం తీసుకు రాలేదు. మాకు తెలియదు’ అని చెప్పారు. పోలీసులు నా భర్తను తీసుకురావడం మా ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. మా అల్లుడి ముందే నా భర్తను కొట్టి, ఇప్పుడు నా భర్త వాళ్ల దగ్గర లేడంటూ పోలీసులు నాటకమాడుతున్నారు. మాకు న్యాయం చేయాలి. – మడికి లక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు, దొడ్డిగుంట


