ఫ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఫ అంబేడ్కర్ జయంతిలో పాల్గొని
వెళుతుండగా ఘటన
అంబాజీపేట: పెళ్లయిన రెండున్నర నెలలకే ఆ యువకుడిని మృత్యువు కబళించింది. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో సరదాగా గడిపిన ఇంటికి వెళుతున్న అతడిని రోడ్డు ప్రమాదంలో కాటేసింది. వివరాల్లోకి వెళితే.. అంబాజీపేట మండలం వాకలగరువుకు చెందిన ముత్తాబత్తుల నాగేంద్రబాబు (26) తన మోటారు సైకిల్‌పై అమలాపురం రూరల్ బండారులంకలోని అత్తవారింటికి వెళుతున్నాడు. అమలాపురం శాంతినగర్‌కు చెందిన నాగవరపు గిరి, ఎలిపే వీరేంద్ర కుమార్, షేక్ నబీలు మోటారు సైకిల్‌పై వస్తూ అంబాజీపేటలో నాగేంద్రబాబును బలంగా ఢీకొన్నారు. ఘటనలో నాగేంద్రబాబు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది అక్కడకు వచ్చేసరికి నాగేంద్రబాబు మృతి చెందాడు. వెంటనే ప్రమాదానికి కారణమైన ఆ ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న సీఐ ఆర్.భీమరాజు, అంబాజీపేట, పి.గన్నవరం, నగరం ఎస్సైలు షేక్ సుభానీ, బి.శివకృష్ణ, కె.చైతన్య కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ పుటేజ్‌లు, స్థానికుల తెలిపిన వివరాల ఆధారంగా నిందితులను అరగంటలోనే పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సీఐ భీమరాజు పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుభానీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ప్రేమ పెళ్లి చేసుకుని.. : నాగేంద్రబాబు రెండున్నర నెలల క్రితమే బండారులంకకు చెందిన సత్యను ప్రేమ పెళ్లి చేసుకుని అత్తవారి ఇంటి వద్దే ఉంటున్నాడు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా వాకలగరువు తదితర ప్రాంతాల్లో ఉత్సవాల్లో పాల్గొని, స్నేహితులతో సరదాగా గడిపాడు. అనంతరం తన భార్యకు ఫోన్ చేసి, ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పి బయలుదేరాడు. ఇంటికి వస్తాడని ఎదురుచూసిన భార్య.. నాగేంద్రబాబు మృతి చెందాడన్న విషయం తెలిసి కన్నీరుమున్నీరైంది. సంఘటనా స్థలంలో భార్య, బంధువులు రోదనలు కంటతడి పెట్టించాయి.


