పెరవలి: కొబ్బరి చెట్టు విరిగి పడడంతో రెండు ఆవుల మృతి చెందిన ఘటన అన్నవరప్పాడులో జరిగింది. పశువైద్యాధికారి చరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరప్పాడుకు చెందిన కోటిపల్లి గంగన్న మంగళవారం ఉదయం పశువుల పాలు తీసి, వాటిని షెడ్డు బయట కట్టేశాడు. అనంతరం చేలో పనిచేసుకుంటుండగా ఉదయం 10.30 ప్రాంతంలో హఠాత్తుగా కొబ్బరి చెట్టు విరిగి రెండు ఆవులపై పడటంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి. వాటికి ఇన్సూరెన్స్ లేకపోవటంతో రైతుకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. వాటిలో ఒకటి సూడి ఆవు అని గంగన్న కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా.. వీఆర్వో శ్రీనివాస్ ఆవులకు పంచనామా నిర్వహించి పశువైద్యాధికారులకు అప్పగించారు. అనంతరం ఆవులను శాస్త్రోతంగా చేలోనే ఖననం చేశారు.
హుండీ దొంగను పట్టుకున్న గ్రామస్తులు
రాయవరం: ఆలయంలో హుండీ సొమ్మును పట్టపగలే చోరీ చేయబోయిన దొంగను గ్రామస్తులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చెల్లూరులోని బాలా త్రిపుర సుందరీ సమేత అగస్తేశ్వరస్వామి ఆలయంలోకి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన కానూరి మల్లేష్ ప్రవేశించాడు. అక్కడి హుండీని పగులగొట్టి నగదును చోరీ చేస్తుండగా గ్రామస్తులు గమనించి పట్టుకున్నారు. అతడిని ఆలయంలో స్తంభానికి కట్టేసి రాయవరం పోలీసులకు అప్పగించారు. మల్లేష్ గతంలో కూడా పలుమార్లు దొంగతనాలకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు.


