టీడీపీ నాయకులకు నిరసన సెగ | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకులకు నిరసన సెగ

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): దళితులపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు ఆయన కుమారుడు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు దళితుల నిరసన సెగ తగిలింది. వివరాల్లోకి.. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మంగళవారం నగరంలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో 47వ డివిజన్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించడానికి విచ్చేశారు. వీరి రాకను గమనించిన దళిత నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ నగర నాయకుడు తిరగటి దుర్గారావు ఆధ్వర్యంలో వారిని అడ్డుకున్నారు. ఆదిరెడ్డి అప్పారావు గోబ్యాక్‌, దళితులపై అవమానకరంగా మాట్లాడినందుకు క్షమించాలని అడగాలి అంటూ నినాదాలు చేశారు. జయంతి, వర్ధంతి సమయంలో వచ్చి అంబేడ్కర్‌ విగ్రహాలకు నివాళులర్పించడంతోనే సరిపోదని, ఆయన ఆశయాల సాధనకు కూడా కృషి చేయాలన్నారు. వెంటనే పోలీసులు, రాపిడ్‌ ఫోర్స్‌ అక్కడకు వచ్చి నినాదాలు చేస్తున్న వారిని పక్కకు తప్పించారు. రోప్‌ సహాయంతో వారిని కట్టడి చేయడానికి ప్రయత్నించారు. ఆదిరెడ్డి అప్పారావు కారులోనే ఉండిపోయారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ కారు కిందికి దిగినా అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించకుండానే వెనుదిరిగారు.

Advertisement
 
Advertisement
Advertisement