సాంకేతికమక | - | Sakshi
Sakshi News home page

సాంకేతికమక

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

బాలాజీచెరువు (కాకినాడ): పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని (స్పాట్‌) ఆధునీకరించాలని ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రవేశ పెట్టిన ట్యాబ్‌ ఆధారిత వ్యవస్థ ప్రారంభ దశలోనే సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. నెట్‌వర్క్‌ లోపాలు, సర్వర్‌ అంతరాయాలు, పరికరాల పనితీరులో సమస్యల కారణంగా మూల్యాంకన ప్రక్రియలో ఆలస్యం జరిగింది. కాకినాడ సాలిపేట మున్సిపల్‌ హైస్కూల్లో జరిగిన స్పాట్‌కు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సమాధాన పత్రాలు వచ్చాయి. ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు కనీసం 40 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలతో మొదటి రోజున 20 పత్రాలకే పరిమితమయ్యారు. మూల్యాంకనం అనంతరం ప్రతి జవాబు పత్రాన్ని స్కాన్‌ చేసి ట్యాబ్‌లో మార్కులు నమోదు చేయాల్సిన ప్రక్రియ క్లిష్టతరంగా మారింది. అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన మార్కులను నమోదు చేసే బాధ్యతను ప్రత్యేకంగా నియమించిన ప్రత్యేక అసిస్టెంట్లకే పరిమితం చేయడం వల్ల పనిలో వేగం తగ్గింది. రోజూ మూల్యాంకనం సాయంత్రానికి ముగియాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం పూర్తికాకపోవడంతో కొన్నిసార్లు జవాబు పత్రాలను మళ్లీ భద్రతా గదులకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సాంకేతిక లోపాల వల్ల ఫలితాల విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

గడువులోపు పూర్తి చేస్తాం

మూల్యాంకనాన్ని బుధవారంలోపు పూర్తి చేస్తాం. సాంకేతిక సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు అందరినీ సమన్వయం చేసుకుంటూ పని పూర్తి చేస్తున్నాం. ట్యాబ్‌ విధానంతో తొలుత కాస్త ఇబ్బందులు పడిన మాట వాస్తవమే.

– పిల్లి రమేష్‌. కాకినాడ జిల్లా విద్యాశాఖాఽఽఽధికారి

Advertisement
 
Advertisement
Advertisement