● సత్యదేవుని నూతన ఆలయానికి
14 ఏళ్లు పూర్తి
● 2011లో నిర్మాణం ప్రారంభం
● 2012 మార్చి 14న కలశ స్థాపన
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుని నూతనాలయం నేడు నవవసంతంలోకి అడుగు పెడుతోంది. రత్నగిరిపై ఆలయ పునర్నిర్మాణం జరిగి ఫాల్గుణ బహుళ సప్తమి అనగా మంగళవారం నాటికి 14 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. నూతన ఆలయం 15వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. గత 15 సంవత్సరాల్లో దేవస్థానంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఏటా భక్తుల సంఖ్యతో పాటు, స్వామివారి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది.
135 సంవత్సరాల చరిత్ర
రత్నగిరిపై సత్యదేవుడు 1891లో ఖర నామ సంవత్సరం, శ్రావణ శుద్ధ విదియ నాడు ఆవిర్భవించారు. నాడు అన్నవరం ఓ కుగ్రామం. ఆలయ చరిత్ర ప్రకారం అప్పట్లో రత్నగిరిపై దట్టమైన అడవి ఉండేది. రకరకాల వన్యప్రాణులు ఇక్కడ సంచరించేవి. 1891లో శ్రావణ శుద్ధ విదియ ముందు రోజు రాత్రి అప్పటి గోర్స ఎస్టేట్ జమీందార్ రాజా ఇనుగంటి వేంకట రామారాయణం కలలో సత్యదేవుడు ప్రత్యక్షమై, తాను అన్నవరంలో రత్నగిరిపై వెలిశానని, తనకు ఆలయం కట్టించాలని చెప్పారట. దీంతో, ఆయన అన్నవరం చేరుకుని ఈ విషయం చెప్పారు. ఆ సందర్భంగా అన్నవరానికి చెందిన ప్రముఖుడు ఈరంకి ప్రకాశరావు తనకు కూడా ఇదే రకమైన కల వచ్చిందని చెప్పారట. దీంతో, మరి కొంత మంది గ్రామస్తులతో కలసి వారిద్దరూ వెతకగా.. గ్రామ దేవత నేరేళ్లమ్మ తల్లి ఆలయం పక్కన ఉన్న కొండ మీద అంకుడు చెట్టు కింద సత్యదేవుని విగ్రహం కనిపించిందని చెబుతారు. తొలుత చిన్న పందిరి నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తరువాత చిన్న ఆలయం, మరి కొన్నాళ్లకు రెండంతస్తుల్లో పెద్ద ఆలయాన్ని నిర్మించి, దిగువ అంతస్తులో శ్రీమత్త్రిపాద్విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతనంతో ప్రతిష్ఠించారు. ఆ ఆలయంలో మధ్యన వీర వేంకట సత్యనారాయణమూర్తి, ఎడమవైపు అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, కుడివైపున లింగాకారంలో పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు.
నూతన ఆలయ నిర్మాణం ఇలా..
సత్యదేవుని పాత ఆలయం శిథిలావస్థకు చేరడంతో కొత్త కోవెల నిర్మించాలని నిపుణులు సూచించారు. ఈ మేరకు 2011లో అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ప్రణాళిక రూపొందించారు. పాత ఆలయం తొలగించే క్రమంలో మూలవిరాట్‌లను తొలగించకుండా, ఆ మూర్తులపై టేకు చెక్కతో తయారు చేసిన పెద్ద పెట్టెను ఉంచి, దానిపై ఇనుప గడ్డర్లతో రక్షణ ఏర్పాటు చేశారు. అయితే, పాత ఆలయాన్ని తొలగించడానికి వీలు లేదని కొంత మంది హైకోర్టును, ఆ తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. సుమారు నెల రోజుల వ్యవధిలో పాత ఆలయాన్ని తొలగించారు. నూతన ఆలయ నిర్మాణం సుమారు ఏడాది పాటు కొనసాగింది. తమిళనాడులోని నమ్మక్కల్ గ్రానైట్ క్వారీల నుంచి సేకరించిన శిలలతో పాత ఆలయం మాదిరిగానే రెండంతస్తుల్లో నూతనాలయం నిర్మించారు. ఈ నిర్మాణం జరిగినన్ని రోజులూ సత్యదేవుడు, అమ్మవారు, శంకరుల ఉత్సవమూర్తులను ధ్వజస్తంభం వద్ద బాలాలయంలో ఉంచి పూజలు నిర్వహించారు.
కంచి పీఠాధిపతి చేతుల మీదుగా..
నాటి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా 2012 మార్చి 14న ఆలయ శిఖరంపై కలశ స్థాపన శాస్త్రోక్తంగా నిర్వహించి, కొత్త కోవెలను ప్రారంభించారు. అప్పటి నుంచీ తిథుల ప్రకారం ఫాల్గుణ బహుళ సప్తమి నాడు నూతన ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. నూతన ఆలయం నవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సత్యదేవుడు, అమ్మవారు, పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు స్వామివారికి లక్ష పత్రి పూజ, ప్రత్యేక నివేదనలు నిర్వహిస్తారు. నూతనాలయ నిర్మాణానికి పని చేసిన వైదిక సిబ్బందిని ఈఓ వి.త్రినాథరావు సత్కరిస్తారు.
పునర్నిర్మాణ సమాచారం
తెలిసేదెలా?
సత్యదేవుని ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా యంత్రాలయ గోడలపై శిలాశాసనం చెక్కించారు. అందులో నూతనాలయ నిర్మాణ విశేషాలను వివరించారు. అయితే, ఇది భక్తులకు కనిపించే అవకాశం ఉండటం లేదు. ఈ సమాచారంతో తూర్పు రాజగోపురం వద్ద ఫ్లెక్సీ లేదా పెయింటింగ్ ఏర్పాటు చేస్తే అందరూ తిలకించే అవకాశం ఉంటుంది.
స్వర్ణ ధ్వజస్తంభం
ఇదిలా ఉండగా ఓ దాత సహకారంతో 2024 మే నెలలో సత్యదేవుని ఆలయంలో నూతన ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేశారు. దీనికి అదే సంవత్సరం ఆగస్టులో బంగారు కవచం ఏర్పాటు చేశారు. ఈ బంగారు ధ్వజస్తంభం భక్తులను ఎంతో ఆకట్టుకుంటోంది.


