బండబాదుడు | - | Sakshi
Sakshi News home page

బండబాదుడు

Mar 9 2026 7:27 AM | Updated on Mar 9 2026 7:27 AM

సామాన్యులపై సిలిండర్‌ ధరాభారం

రూ.60 పెంచుతూ కేంద్రం నిర్ణయం

వాణిజ్య కనెక్షన్‌పై రూ.114 పెంపు

11 నెలల్లో రెండోసారి..

ఇప్పటికే నిత్యావసర ధరల సెగ

తాజా పెంపుతో సర్వత్రా అసహనం

ప్రజలపై నెలకు రూ.2.34 కోట్ల భారం

సాక్షి, రాజమహేంద్రవరం: నిత్యావసర ధరలు, విద్యుత్‌ చార్జీల పెంపుతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలపై ప్రభుత్వం వంట గ్యాస్‌ సిలిండర్‌ భారం మోపింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.60 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్టు కంపెనీలు ప్రకటించాయి. ఈ పెంపుతో ప్రస్తుతం రూ.879.50 ఉన్న ధర రూ.939కి చేరింది. ఇది కేవలం సాధారణ వినియోగదారులకే కాకుండా ఉజ్వల పథకం లబ్ధిదారులకు సైతం వర్తింపజేశారు. ఈ పరిణామం సాధారణ, మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళన నింపుతోంది. రూ.1,949గా ఉన్న కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.114 పెరిగి రూ.2,063కు చేరింది. ఇప్పటికే నిత్యావసర ధరలు, విద్యుత్‌ చార్జీల బాదుడు సాగుతుండగా తాజాగా గ్యాస్‌ ధర పెంపును సామాన్య ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

రోజుకు రూ.7.80 లక్షల భారం

జిల్లాలో మొత్తం గ్యాస్‌ కనెక్షన్లు సుమారు 6,24,265. ఇందులో సాధారణ కనెక్షన్లు 2,25,394, దీపం 1,65,012, సీఎస్‌ఆర్‌ 7,229, ఉజ్వల 6,553, 5 కేజీల సిలిండర్‌ 2,141, కమర్షియల్‌ 3,405, డబుల్‌ కనెక్షన్లు 2,14,531 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 3 ప్రధాన కంపెనీలు, 43 ఏజెన్సీల ద్వారా గ్యాస్‌ సరఫరా చేస్తున్నాయి. గృహ వినియోగదారులకు నిత్యం సుమారు 13 వేల వరకు సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. తాజా పెంపుతో రోజుకు రూ.7.8 లక్షల వరకు వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. నెలకు రూ.2.34 కోట్ల వరకు భారం పడుతోంది. కమర్షియల్‌ సిలిండర్లపై నెలకు మరో రూ.3,88,170 అదనపు భారం పడుతోంది.

ఉజ్వలకూ వర్తింపు

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్‌ సిలిండర్‌, స్టౌ మంజూరు చేసింది. అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద జిల్లాలో 41,055 గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేశారు. ప్రస్తుత పెంపు వారికి సైతం వర్తింప చేశారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు మంజూరు చేసిన పథకాన్ని సైతం పెంపులో భాగస్వామ్యం చేయడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.

సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆందోళన

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధంతో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో వంటగ్యాస్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. కందిపప్పు, మినప్పప్పు, వంట నూనె తదితర ధరలు పెరిగి సామాన్యుడు కొనలేని పరిస్థితి తలెత్తింది. ఇలాంటి తరుణంలో గ్యాస్‌ రూ.60కి పెరగడంతో మరిన్ని ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నలుగురున్న ఒక మధ్య తరగతి కుటుంబానికి ఒక సిలిండర్‌ రెండు నెలలు వరకు వినియోగించుకోవచ్చు. అంటే ఏడాదికి ఆరు సిలిండర్లు అవసరం అవుతాయి. ఏడాదికి అదనంగా రూ.360 చెల్లించాల్సి వస్తోంది.

11 నెలల్లో రూ.110 భారం

11 నెలల వ్యవధిలో గ్యాస్‌ ధర రెండుసార్లు పెరిగింది. గతేడాది ఏప్రిల్‌లో గృహ వినియోగ సిలిండర్‌పై రూ.50 పెరిగింది. ప్రస్తుతం మరో రూ.60 పెరిగింది. వాణిజ్య సిలిండర్లపై భారీగా పెంచడంతో హోటల్‌, రెస్టారెంట్‌, ఆహార పదార్థాలు తయారు చేసే వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.

కనికరించని కూటమి ప్రభుత్వం

కేంద్రం గ్యాస్‌ ధర ఏకంగా రూ.60 పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నా కూటమి ప్రభుత్వం కనీస స్పందన కరువైంది. రాష్ట్ర పరిధిలో నియంత్రించేందుకు ముందుకు రాకపోవడంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పెంచిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాగే పెంచుతూ పోతే తమ పరిస్థితి ఏమవ్వాలని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement