ఫ అధికారులను పరుగులు పెట్టిస్తున్న పెద్ద పులి
ఫ హడలెత్తిస్తున్న గిరిజన ప్రజలు
రాజవొమ్మంగి/ అడ్డతీగల: అధికారులను పెద్ద పులి ఉరుకులు, పరుగులు పెట్టిస్తోంది. చివరికి ఎవరికీ చిక్కకుండా తిరుగుతోంది. దేవీపట్నం మండలం దేవారంలో 15 రోజుల కిందట ప్రవేశించిన పెద్ద పులి అక్కడి నుంచి అన్ని మండలాల్లో సంచరిస్తూ అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పులి వరుసగా రంపచోడవరం మండలం పెద్దకొండ, కొమరవరం, గంగవరం మండలం పిడతమామిడి, గోకవరం మండలం ముల్లేరుమల్లారం, ఏలేశ్వరం మండలం పరింతడక గ్రామ సమీపాల్లో సంచరించింది. అక్కడి నుంచి పులి నెమ్మదిగా సోమవారం రాజవొమ్మంగి అటవీక్షేత్ర పరిధిలోని కొత్తూరు, వీరభద్రపురం, బోర్నగూడెం, మర్రిపాలెం గ్రామాల్లోకి ప్రవేశించిందని అధికారులు చెబుతున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే అడ్డతీగల సబ్ డీఎఫ్‌ఓ సుబ్బారెడ్డి తమ సిబ్బందితో బోర్నగూడెం పరిసర ప్రాంతాల్లో కాపు కాశారు. ఈ నేపథ్యంలో బోర్నగూడెం, సంజీవనగరం, చెరకుంపాలెం పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులను అడవుల్లోకి మేతకు పంపించవద్దని, ప్రజలెవరూ లోతట్టు అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని దండోరా వేయించారు. ఇదిలా ఉండగా శ్రీశైలం టైగర్ ప్రాజెక్టుకు చెందిన శిక్షణ పొందిన 50 మందికి పైగా అధికారులు ఈ ప్రాంతంలో పులి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. పులిని బంధించేందుకు అవసరమైన బోన్లను సిద్ధంగా ఉంచారు. పులి ఆచూకీ కోసం ఆధునిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం అధికారుల వద్ద ఉన్న వీఎఫ్‌ఎక్స్ అనే పరికరం ద్వారా పులి మెడలో గల హైఫ్రీక్వెన్సీ రేడియో కాలర్‌ను (ధర్మల్ డ్రోన్ సిస్టం) ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. కాగా బోర్నగూడెం వద్ద కాసేపు వీహెచ్‌ఎఫ్‌లో సిగ్నల్ కనిపించినప్పటికీ తిరిగి సిగ్నల్స్ కట్ అయ్యిందని ఫారెస్టు అధికారులు తెలిపారు. ఆ తరువాత దాదాపు ఐదు కిలోమీటర్ల రేడియస్‌లో పులి ఆనవాళ్లు కనిపించ లేదు. కాగా చీకటి పడే వేళకు మండలంలోని మర్రిపాలెం వైపు పులి వెళ్లిందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ గ్రామాల వైపు యంత్రాంగం కదిలింది. మండలంలోని గడుఓకుర్తి పంచాయతీ, గొబ్బిలమడుగు అడవుల్లోకి వెళ్లే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. స్థానిక రేంజ్ ఆఫీసర్ ఉషారాణి ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే రాత్రి సమయంలో రాజవొమ్మంగి మండలం సంజీవనగరం వద్ద రోడ్డును దాటి వెళ్లినట్లు ప్రజలు చెబుతున్నారు.


