● గత ఖరీఫ్‌లో 4 లక్షల మెట్రిక్
టన్నుల కొనుగోలు
● నేటికీ అందని రవాణా, హమాలీ చార్జీలు
● సుమారు రూ.13 కోట్లకు పైగా బకాయిలు
● మూడు మాసాలైనా అందని నగదు
● కీలక దశలో రబీ పంటల సాగు
● పెట్టుబడులకు తప్పని ఆర్థిక కష్టాలు
సాక్షి, రాజమహేంద్రవరం: ఖరీఫ్ రైతులకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి విపత్తులకు అతలాకుతలం అయిన కర్షకులు నేటికీ కోలుకోలేక పోతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో భారీ ఈదురుగాలులు, వర్షాలు కురవడం, వరదల్లో పంట నీట మునగడంతో ధాన్యం పాడైపోయి తీవ్రంగా నష్టపోయారు. నీట మునగగా.. మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించారు. ధాన్యం కొనుగోళ్లలోనూ ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం బిల్లులు సైతం ఆలస్యంగానే విడుదల చేసింది. తాజాగా మరో అవస్థ తప్పడం లేదు. ఖరీఫ్‌లో ధాన్యం విక్రయించిన రైతులకు ధాన్యం రవాణా, హమాలీ చార్జీలు, సంచుల బిల్లులు నేటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. సేకరణ ముగిసి మూడు మాసాలు దాటుతున్నా.. నేటికీ డబ్బు విడుదల చేయకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం రబీ సాగు కీలక దశలో ఉంది. మంచి దిగుబడులు సాధించాలంటే పురుగుమందులు, ఎరువులకు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. కానీ చేతిలో సొమ్ము లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తాము ఖర్చు చేసిన రవాణా, హమాలీ చార్జీలైనా అందితే ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఇప్పట్లో విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖరీఫ్‌లో వరుస తుపాన్లు, వరదల నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. జిల్లాలో వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితులను అధిగమించి మార్కెట్‌కు తరలించిన పంటకు రావాణా, హమాలీ చార్జీలు చెల్లించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇలా...
ధాన్యం కొనుగోళ్లలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరవైంది. కోతలు ప్రారంభించిన వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకుండా ఆలస్యం చేయడంతో రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకుని నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో 79,966 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకుగాను 212 ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ–పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ప్రకటించారు. గ్రేడ్–ఏ రకం ధాన్యం క్వింటాకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369గా ధర నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించారు. ధాన్యం కేంద్రాల వారీగా టార్గెట్ పూర్తయిందంటూ చేతులెత్తేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపించేశారు. వెరసి జిల్లాలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువ ధరకు బహిరంగ విపణిలో విక్రయించుకోవాల్సి వచ్చింది.
రూ.13 కోట్లకు పైగా పెండింగ్
జిల్లా వ్యాప్తంగా గత ఖరీఫ్ సీజన్‌లో వరి రైతులకు చెల్లించాల్సిన రవాణా, హమాలీ చార్జీలకు ఇప్పటికీ దిక్కు లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మూడు నెలల కావస్తున్నా నగదు కోసం నిరీక్షణ తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.13 కోట్లకు పైగా అందాల్సి ఉంది. హమాలీ చార్జీలు రూ.6.50 కోట్లు, ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు రూ.6 కోట్లు, సంచులకు రూ.1.35 కోట్లు విడుదల కావాల్సి ఉంది. క్వింటా ధాన్యానికి హమాలీ చార్జీగా రూ.24, రవాణా చార్జీల నిమిత్తం టన్నుకు రూ.324 చెల్లించాల్సి ఉంది. కానీ వాస్తవంగా ప్రభుత్వం చెల్లించే చార్జీల కన్నా రెట్టింపు స్థాయిలో రైతులకు ఖర్చవుతుంది. వాస్తవ ఖర్చులను పరిగణలోకి తీసుకుని రావాణా, హమాలీ చార్జీలను పెంచాలని రైతులు కోరుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఒక క్వింటా ధాన్యాన్ని కూలీలతో పట్టుబట్టించి మిల్లుకు పంపేందుకు రూ.100 వరకు ఖర్చవుతుంటే.. రైతుకు అందుతున్నది రూ.56 మాత్రమే. పెరిగిన ఖర్చుల దృష్ట్యా వీటిని పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రబీ వరి పంట కీలక దశలో ఉండటంతో ఈ సమయంలో ఆ బకాయిలు అందితే పెట్టుబడికి కొంతమేర ఉపయోగంగా ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. చెల్లింపుల్లో జాప్యంతో రబీ కోసం అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు.
ప్రభుత్వం స్పందించాలి
రైతులకు అందాల్సిన రవాణా, హమాలీ చార్జీలు చెల్లిస్తే రబీసాగుకు పెట్టుబడి సాయంగా ఉంటుంది. మూడు నెలలు గడుస్తున్నా చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వాస్తవ ఖర్చులు పరిగణనలోకి తీసుకుని చార్జీలను పెంచాలి.
– పరిమి సోమరాజు,
వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి


