సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 282 అర్జీలు స్వీకరించినట్టు డీఆర్‌ఓ సీతారామమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అర్జీలు స్వీకరించడం, ఆన్‌లైన్ విధానాన్ని ఎక్కువగా వినియోగించుకోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం అన్నారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు
45 ఫిర్యాదులు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 45 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ డి.నరసింహాకిశోర్ ఆదేశాల మేరకు నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాది దారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. కుటుంబ సమస్యలు, సివిల్, ఛీటింగ్, కొట్లాట కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు.
సెంట్రల్ జైలును
సందర్శించిన డీఎల్‌ఎస్‌ఏ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మీ సోమవారం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. అక్కడ ఖైదీలకు అందుతున్న ఆహార ప్రమాణాలు, సౌకర్యాలను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా, బెయిల్ పిటిషన్లపై కోర్టులో అప్పీలు వేయాలన్నా ఉచితంగా సేవలు పొందవచ్చని వారికి తెలిపారు. దీనికోసం పారాలీగల్ వలంటీర్ల ద్వారా అర్జీలను అందించాలన్నారు. ముద్దాయిలు, ఖైదీలు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించుకోవాలన్నారు.
సస్పెన్షన్.. సరెండర్..
‘నకిలీ పత్రాలతో ప్రభుత్వ
ఉద్యోగం’పై చర్యలు
కాకినాడ క్రైం: రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లపై వేటు పడింది. సీనియర్ అసిస్టెంట్ ఏకే అమర్‌కాంత్ నకిలీ పత్రాలతో పూల హేమలత అనే మహిళకు జూనియర్ అసిస్టెంట్‌గా ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం వేయించిన ఉదంతం వివాదాస్పదమైంది. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై అధికారులు స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు అమర్‌కాంత్‌ను సరెండర్ చేస్తూ రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కేవీ శివప్రసాద్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హేమలతపై సస్పెన్షన్ వేటు వేసి, చట్టపరమైన చర్యలు చేపట్టబోతున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. అమర్‌కాంత్ నిర్వాకాన్ని ఆర్‌డీ పద్మా శశిధర్‌కు లిఖితపూర్వకంగా సమర్పించిన ప్రిన్సిపాల్, ఆయనను సరెండర్ చేస్తున్నట్లు నిర్ధారించారు. మోసపూరిత కార్యకలాపాల నేపథ్యంలో తీవ్రత ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. దీనిపై ఆర్‌డీ ఏవిధంగా స్పందిస్తారనే చర్చ సాగుతోంది.
28 నుంచి వాడపల్లి వెంకన్న కల్యాణోత్సవాలు
ఆత్రేయపురం : కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ, అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం ఆలయ ఆవరణలో జరిగిన సామూహిక అష్టోత్తర పూజలలో పెద్ద సంఖ్యలో దంపతులు, మహిళలు భక్తులు పాల్గొన్నారు. ఆలయానికి హుండీలు, కానుకల రూపంలో రూ.4,10,091 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.


