క్షయ గుర్తింపునకు ‘శ్వాస’ | - | Sakshi
Sakshi News home page

క్షయ గుర్తింపునకు ‘శ్వాస’

Feb 20 2026 6:37 AM | Updated on Feb 20 2026 6:37 AM

క్షయ

క్షయ గుర్తింపునకు ‘శ్వాస’

పైలట్‌ ప్రాజెక్టులుగా

రాజానగరం, చాగల్లు ఎంపిక

ఇంటింటా సర్వే చేస్తున్న బృందాలు

రాజానగరం: క్షయ (టీబీ) బాధితులను గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ‘శ్వాస’ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. నిరంతరం దగ్గుతో బాధపడే వారిని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారంగా రూపొందించిన ప్రత్యేక యాప్‌ ద్వారా పరీక్షిస్తారు. వారికి వస్తున్న దగ్గు టీబీకి సంబంధించిందో లేదో గుర్తిస్తారు. దీని అమలుకు జిల్లాలోని రాజానగరం, చాగల్లు పీహెచ్‌సీలను పైలట్‌ ప్రాజెక్టులుగా ఎంపిక చేశారు. ఈ పీహెచ్‌సీల పరిధిలోని వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి 50 సంవత్సరాలు పైబడిన వారికి ప్రత్యేక యాప్‌ ద్వారా దగ్గు పరీక్ష చేస్తారు. అనుమానితులకు పీహెచ్‌సీలో అవసరమైన వైద్య పరీక్షలు చేసి, టీబీతో పాటు ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధులున్నట్టు గుర్తిస్తే తగిన వైద్య సేవలందిస్తారు. ఇప్పటి వరకూ టీబీ వ్యాధిని గుర్తించేందుకు పీహెచ్‌సీలోని ల్యాబ్‌లో రోగి కళ్లెను పరీక్షించేవారు. అయితే, శ్వాస యాప్‌ ద్వారా దగ్గును బట్టి అది టీబీయో కాదో వెంటనే తెలుస్తుంది. ఈ పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే, దశలవారీగా అన్ని పీహెచ్‌సీల్లోనూ అమలు చేస్తారు.

సర్వే పర్యవేక్షణ

రాజానగరంలో గురువారం ప్రారంభమైన ‘శ్వాస’ సర్వేను విజయవాడ నుంచి వచ్చిన ప్రత్యేక టీమ్‌ డైరెక్టర్‌ నారాయణరావు, డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ శ్రీరామ్మూర్తి పర్యవేక్షించారు. సర్వే విధానాన్ని, సర్వే గురించి రోగులకు ముందుగా ఏవిధంగా అవగాహన కలిగిస్తున్నారనే విషయాలను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్‌ సీహెచ్‌ వెంకటలక్ష్మి, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌

శ్వాసకోశ వ్యాధులను గుర్తించి, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ‘శ్వాస’ యాప్‌ను రూపొందించారు. ఇది ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌. దగ్గు శబ్దాన్ని విశ్లేషించడం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దీని ద్వారా అంచనా వేయవచ్చు. రోగి ఫోన్‌ మైక్రోఫోన్‌ వద్ద మూడుసార్లు దగ్గితే దాని ఫ్రీక్వెన్సీ, వ్యాప్తి, ఇతర పరామితులను విశ్లేషించి కొద్ది సమయంలోనే రిపోర్టు అందజేస్తుంది. టీబీతో పాటు ఆస్తమా, సీఓపీడీ, ఇంటర్‌స్టీషియల్‌ ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన శ్వాసకోశ నమూనాలను గుర్తిస్తుంది.

– డాక్టర్‌ వసుంధర, జిల్లా కుష్ఠు, ఎయిడ్స్‌,

క్షయ వ్యాధి నివారణాధికారి

క్షయ గుర్తింపునకు ‘శ్వాస’1
1/2

క్షయ గుర్తింపునకు ‘శ్వాస’

క్షయ గుర్తింపునకు ‘శ్వాస’2
2/2

క్షయ గుర్తింపునకు ‘శ్వాస’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement