చిగురిస్తున్న ఆశలు | - | Sakshi
Sakshi News home page

చిగురిస్తున్న ఆశలు

Feb 20 2026 6:37 AM | Updated on Feb 20 2026 6:37 AM

చిగుర

చిగురిస్తున్న ఆశలు

ఆశాజనకంగా వర్జీనియా పొగాకు సాగు

బాగున్న రంగులు, దిగుబడులు

అనుకూలించిన వాతావరణం

మార్కెట్‌పై రైతుల ఆశలు

దేవరపల్లి: వర్జీనియా పొగాకు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈసారి కూడా దండిగా దిగుబడి వస్తుందని, ధర కూడా అదే రీతిలో దక్కాలని ఆశిస్తున్నారు. సాగు ఆరంభంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ సీజన్‌లో నాట్లు దాదాపు నెల రోజులు ఆలస్యమయ్యాయి. అయితే, మొక్క నాటినప్పటి నుంచీ వాతావరణం అనుకూలించడంతో తోటలు బాగుతున్నాయని రైతులు చెబుతున్నారు. లేతగా వేసిన తోటలు పలు ప్రాంతాల్లో తెగుళ్ల బారిన పడినప్పటికీ, కోలుకున్నాయి. రంగులు, నాణ్యత, దిగుబడి బాగున్నాయి. దీంతో, 99 శాతం బ్రైట్‌ పొగాకు వస్తుందని రైతులు ఆశిస్తున్నారు.

ముమ్మరంగా రెలుపులు, క్యూరింగ్‌లు

పలు ప్రాంతాల్లో పక్వానికి వచ్చిన పొగాకును రెలిచి బ్యారన్లలో ముమ్మరంగా క్యూరింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికే నాలుగైదు క్యూరింగ్‌లు జరగడంతో రైతులు ఆ పొగాకును గ్రేడింగ్‌ చేసి, మండెలు వేసి, జాగ్రత్త చేస్తున్నారు. టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, ఏలూరు జిల్లా కొయ్యలగూడెంతో పాటు జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాల పరిధిలో వర్జీనియా పొగాకును ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించిన పంటకు ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ఖరీదైన సిగరెట్ల తయారీకి దీనిని వినియోగిస్తారు. ఈ పొగాకును వేలం కేంద్రాల ద్వారా మార్చి నెల నుంచి సెప్టెంబర్‌ వరకూ వివిధ సంస్థలు కొనుగోలు చేస్తాయి. దాదాపు 25 కంపెనీలు వేలంలో పాల్గొంటాయి. ఎక్కువ శాతం పొగాకును ఇండియా టుబాకో కంపెనీ (ఐటీసీ) కొనుగోలు చేస్తుంది. పొగాకు తోటలను, క్యూరింగ్‌లు, గ్రేడింగ్‌ పెండాల్స్‌ను బోర్డు అధికారులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులు సందర్శించి, రైతులకు సాంకేతిక సూచనలు, సలహాలు ఇస్తున్నారు. క్యూరింగ్‌, గ్రేడింగ్‌ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.

అంచనాలకు మించి ఉత్పత్తి!

రెండు మూడేళ్లుగా పొగాకు సాగు లాభదాయకంగా ఉంది. గత ఏడాది మార్కెట్లో కిలో గరిష్ట ధర ఏకంగా రూ.453 పలకడంతో రైతులకు ఊహించని ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు అధిక విస్తీర్ణంలో పంట వేశారు. వీరిలో 80 శాతం మంది కౌలుదారులు. రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలో 49.32 మిలియన్‌ కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే, తోటలు ఆశాజనకంగా ఉండటంతో 75 మిలియన్‌ కిలోల వరకూ ఉత్పత్తి జరగవచ్చని అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. గత ఏడాది 61.27 మిలియన్‌ కిలోలకు అనుమతి ఇవ్వగా 83.88 మిలియన్‌ కిలోల ఉత్పత్తి జరిగింది.

1,120 హెక్టార్లలో

బీఎస్‌ సాగు

దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలోని తొర్రేడు ప్రాంతంలో 893 మంది రైతులు, 1,013 బ్యారన్లు కలిగి ఉన్నారు. వీరు 1,120 హెక్టార్లలో బ్లాక్‌సాయిల్‌ (బీఎస్‌) పొగాకు పండిస్తున్నారు. వీరికి 2.03 మిలియన్‌ కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతిచ్చింది.

మార్చి చివరిలో వేలం ప్రారంభం?

పొగాకు కొనుగోళ్లు మార్చి చివరి వారంలో ప్రారంభించడానికి ట్రేడర్లు, బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్‌ మొదటి వారంలో వేలం ప్రక్రియ ప్రారంభించడానికి బోర్డు అధికారులు సిద్ధమవుతుండగా, మార్చి నెలలోనే ప్రారంభించాలని రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. దీనిపై మార్చి నెలలో బోర్డు సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

సంగాయగూడెంలో ఆశాజనకంగా వర్జీనియా పొగాకు తోట

రాజమహేంద్రవరం రీజియన్‌లో

వర్జీనియా పొగాకు సాగు వివరాలు

సాగు విస్తీర్ణం 29,132 హెక్టార్లు

మొత్తం రైతులు 12,612 మంది

బ్యారన్లు 14,417

ఉత్పత్తి అనుమతి 49.32 మిలియన్‌ కిలోలు

ఉత్పత్తి అంచనా 75 మిలియన్‌ కిలోలు

ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడికి చాన్స్‌

(రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న దాని కంటే అదనంగా

6,540 హెక్టార్లలో సాగు జరుగుతోంది.)

వేలం కేంద్రాల వారీగా పొగాకు సాగు విస్తీర్ణం

(హెక్టార్లలో), రైతులు, బ్యారన్ల వివరాలు

వేలం కేంద్రం రైతులు బ్యారన్లు సాగు విస్తీర్ణం

దేవరపల్లి 1,792 2,873 3,100

జంగారెడ్డిగూడెం–1 2,488 2,927 6,756

జంగారెడ్డిగూడెం–2 2,760 3,020 7,311

కొయ్యలగూడెం 2,733 3,090 6,211

గోపాలపురం 2,153 2,622 4,633

మంచి ధర పలకాలి

ఈ ఏడాది ఎకరాకు ఖర్చు రూ.30 వేలు అదనంగా పెరిగింది. నేను 50 ఎకరాల్లో పొగాకు సాగు చేశాను. ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటున్నాను. మార్కెట్లో మంచి ధర పలకాలని కోరుకుంటున్నాను. సకాలంలో వేలం ప్రారంభించి కొనుగోలు చేయాలి. ఎక్కువ రోజులు వేలం జరగడం వల్ల పొగాకు నాణ్యత దెబ్బ తింటుంది.

– వల్లభనేని సత్యనారాయణ, వైఎస్సార్‌ సీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, వెదుళ్లకుంట,

గోపాలపురం మండలం

ఎక్కువగా బ్రైట్‌ వస్తోంది

పొగాకు రంగులు బాగున్నాయి. బ్రైట్‌ రకం ఎక్కువగా వస్తోంది. లో గ్రేడ్‌ తగ్గింది. ఎగుమతులకు అనుకూలమైన పొగాకు పండింది. ఎకరాకు సుమారు 12 క్వింటాళ్ల దిగుబడి రావచ్చు. మార్చి చివరి వారంలో కొనుగోళ్లు ప్రారంభించాలని బోర్డు అధికారులను కోరాం. ఈ ఏడాది ఉత్పత్తి ఖర్చులు, కౌలు, పెట్టుబడి పెరిగాయి.

– కరుటూరి శ్రీనివాస్‌, పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు, సంగాయగూడెం, దేవరపల్లి మండలం

ఆ ఆకులు క్యూరింగ్‌ చేయాలి

పక్వానికి వచ్చిన ఆకులను రెలిచి, క్యూరింగ్‌ చేయాలి. అలాగైతే నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయవచ్చును. గ్రేడింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రేడింగ్‌ చేసిన పొగాకు మండెలను ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. అన్య పదార్థాలు లేకుండా చూడాలి. బేళ్లు, మండెల్లో తేమ శాతం సరిచూసుకోవాలి. పొగాకు నాణ్యత బాగుంది. 70 నుంచి 75 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరుగుతుందన్నది ఇప్పటి అంచనా.

– జీఎల్‌కే ప్రసాద్‌, రీజినల్‌ మేనేజర్‌,

పొగాకు బోర్డు, రాజమహేంద్రవరం

చిగురిస్తున్న ఆశలు1
1/5

చిగురిస్తున్న ఆశలు

చిగురిస్తున్న ఆశలు2
2/5

చిగురిస్తున్న ఆశలు

చిగురిస్తున్న ఆశలు3
3/5

చిగురిస్తున్న ఆశలు

చిగురిస్తున్న ఆశలు4
4/5

చిగురిస్తున్న ఆశలు

చిగురిస్తున్న ఆశలు5
5/5

చిగురిస్తున్న ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement