మహిళా క్రికెట్‌కు మంచిరోజులు
● అండర్–14, అండర్–17
ఎంపికలకు పెరిగిన ప్రాతినిధ్యం
● స్ఫూర్తిని నింపిన
భారత మహిళా క్రికెట్ జట్టు విజయం
సాక్షి, అమలాపురం/ అంబాజీపేట: నిన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క.. అని అంటున్నారు మహిళా క్రికెటర్లు. ప్రపంచ కప్ విజయం సాధించనంత వరకు పెద్దగా ఆదరణ లేని మహిళ క్రికెట్‌కు ఇప్పుడు ఒకటి రెండు రోజుల్లోనే స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ ప్రభావం అప్పుడే పాఠశాల స్థాయిలో బాలికలపై చూపిస్తోంది. ఇందుకు ఉదాహరణ కోనసీమ జిల్లా అంబాజీపేటలో జరిగిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల క్రికెట్ ఎంపికలు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల అండర్–14, అండర్–17 బాలుర, బాలికల జట్ల ఎంపికలు అంబాజీపేట క్రీడా మైదానంలో మంగళవారం జరిగాయి. గతంలో బాలికల జట్టుకు ఎంపిక అయ్యేందుకు వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇటీవల మహిళా క్రికెట్‌కు కొంత ఆదరణ పెరగడం.. భారత్ మహిళా జట్టు విశ్వ విజేతగా నిలవడంతో ఈసారి ఎంపికలకు బాలికలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎంపిక పోటీలలో బాలురతోపాటు బాలికలు కూడా సత్తా చాటారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో ఆల్‌రౌండ్ ప్రతిభ చాటారు. ఒకప్పటి ఎంపికలతో పోల్చుకుంటే బాలికల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగిందని ఎంపిక కమిటీ సభ్యులు చెబుతున్నారు.
మహిళా క్రికెట్‌కు మంచిరోజులు


