పెరుగుతున్న సిరిముడులు!
● అయ్యప్ప మాలధారణకు తరగని ఆదరణ
● ఏటేటా ఎక్కువవుతున్న దీక్షాధారులు
● ఆర్టీసీకి, రైల్వేకు సమకూరుతున్న ఆదాయం
●
రాయవరం: ఏటా కార్తిక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్షలు కొనసాగుతుంటాయి. నియమ నిష్టలతో మాలలు ధరించి భక్తి శ్రద్ధలతో 41 రోజుల పాటు భగవంతుని దీక్షలో గడిపిన స్వాములు ఇరుముడులతో శబరిమలకు పయనమవుతారు. అయ్యప్ప దీక్ష..ఆరోగ్యానికి రక్ష అని వైద్య నిపుణులు సైతం పేర్కొంటుండడంతో ఏటేటా అయ్యప్ప మాల ధరించేవారి సంఖ్య పెరుగుతోంది. వీరు కేరళ రాష్ట్రంలోని శబరిమలకు రైళ్లలోను, బస్సులలోను వెళుతుండడంతో ఆర్టీసీకి, రైల్వేకు ఏటా ఆదాయం పెరుగుతోంది.
జిల్లాలో లక్ష మంది స్వాములు
35 ఏళ్ల క్రితం దీక్ష తీసుకునే అయ్యప్పలు కేవలం వందల సంఖ్యలో ఉంటే ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా లక్ష మంది వరకు ఉన్నట్టు అంచనా. 10 నుంచి వందల సంఖ్యలో స్వాములు ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరుచుకొని అక్కడే ఉంటున్నారు. ఈ ఆశ్రమాలలోనే భక్తులు భిక్ష (భోజనం) తీసుకుంటారు. నవంబర్ నెల నుంచి జనవరి నెల వరకు అయ్యప్ప స్వాములు జిల్లా నుంచి కేరళ రాష్ట్రంలోని శబరిమలకు రైళ్లలోను, బస్సులలోను వెళుతుంటారు. అయ్యప్ప భక్తుల్లో 70శాతం మంది రైళ్లలో వెళ్తున్నారు. ఈ విధంగా జిల్లా నుంచి రైల్వేకు సుమారుగా రూ.20 కోట్ల వరకు ఆదాయం వస్తోందని అంచనా. ఆర్టీసీ బస్సులలో కూడా స్వాములు శబరిమల యాత్రకు వెళుతున్నారు. గతేడాది జిల్లా నుంచి 16 బస్సుల ద్వారా స్వాములు శబరిమలకు వెళ్లగా ఆర్టీసీకి రూ.33.82 లక్షల ఆదాయం సమకూరింది.
స్వాముల సేవలో తరిస్తున్న సంస్థలు
అయ్యప్ప భక్తులకు పలువురు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. స్వాములకు పలువురు అన్నదానం చేస్తున్నారు. కొందరు ఒక్కొక్క రోజు అన్నదానం చేస్తుంటే కొందరు మండల రోజులు సేవ చేస్తున్నారు. ద్వారపూడి, అనపర్తి, మండపేట, కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, కనకాలపేట తదితర ప్రాంతాల్లో అయ్యప్ప ఆలయాల వద్ద స్వాములకు ప్రతి రోజూ అన్నదానం చేస్తున్నారు.
శబరిమలకు ప్రత్యేక బస్సులు
అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం ఆర్టీసీ శబరిమలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. గతేడాది జిల్లా నుంచి 16 బస్సులను నడపగా ఈ ఏడాది 33 సర్వీసులు నడపాలనేది లక్ష్యం. ఇప్పటి వరకు జిల్లాలో 18 ఆర్టీసీ బస్సులను శబరిమల ప్రయాణానికి భక్తులు బుక్ చేసుకున్నారు.
– ఎస్‌టీపీ రాఘవకుమార్,
జిల్లా ప్రజా రవాణా అధికారి, అమలాపురం
పెరుగుతున్న సిరిముడులు!


