అత్తకు తలకొరివి పెట్టిన కోడలు
ముమ్మిడివరం: మండలంలోని సీహెచ్ గున్నేపల్లి గ్రామానికి చెందిన పాపిరెడ్డి ఆదిలక్ష్మి ఆధివారం వృద్ధాప్యంతో మృతిచెందారు. ఆమె భర్త, కుమారుడు గతంలోనే మృతిచెందారు. మనుమలు చిన్నపిల్లలు కావడంతో ఆమె కోడలు పాపిరెడ్డి శ్రీదేవి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
పి.గన్నవరం: రాజవరం–పొదలాడ రోడ్డులో శనివారం అర్ధరాత్రి మొండెపులంక లాకు వద్ద ఇద్దరు యువకులు మోటారు బైక్‌పై వస్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన యువకులు నెల్లి హర్షవర్దన్ (23), వల్లూరి తేజ (16) ఇంటి వద్ద రావులపాలెం వెళ్తున్నట్టు చెప్పి మోటారు బైక్‌పై బయల్దేరారు. మొండెపులంక వద్ద రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ సంభాన్ని వారు వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న హర్షవర్థన్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న తేజ తీవ్రంగా గాయపడగా స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. హర్షవర్ధన్ జీవనోపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్లాడు. మూడు నెలల క్రితం ఇక్కడికి వచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.
బలవంతంగా
పెళ్లి చేశారని ఫిర్యాదు
సీతానగరం: మండలంలోని మునికూడలికి చెందిన ఖండవల్లి శారా అపర్ణకు బలవంతంగా వివాహం చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేశామని ఎస్సై డి.రామ్‌కుమార్ ఆదివారం తెలిపారు. అపర్ణ బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. తన సమీప బంధువు గల్లా చందును అభిమానిస్తోంది. గత నెల 10వ తేదీ రాత్రి 7 గంటలకు చందు అపర్ణ ఇంటికి రాగా అది చూసిన చిడిపి స్టాలిన్, అనిమిల్లి సురేష్, కొడమంచిలి సుబ్బారావు, కొడమంచిలి తేజ, అనిమిల్లి సుధాకర్, అనిమిల్లి నాగేంద్ర బలవంతంగా చందుతో పెళ్లి చేశారు. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామ్‌కుమార్ తెలిపారు.


