కూటమి పాలనలో బాలికలకు రక్షణ లేదు
ఐ.పోలవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకే కాకుండా బాలికలకు చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. ఐ.పోలవరం మండలం బాణాపురంలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని ఆదివారం ఆమె వైఎస్సార్ సీపీ ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్ కుమార్‌తో కలిసి పరామర్శించారు. నిందితుడు జనసేన పార్టీకి చెందిన రాయపురెడ్డి వెంకటకృష్ణ బాబి చేసిన దురాగాతల గురించి తెలుసుకుని తీవ్ర ఆవేదన చెందారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ప్రతిపక్షాలను అణచివేయడం కోసం తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను అరెస్టులు చేస్తున్నారు. కూటమి పార్టీలకు చెందిన నాయకులు మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వమే రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తోంది అని ఆరోపించారు. మహిళల మాన ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఒక దొంగ, రౌడీషీటర్‌ను స్పోర్ట్స్ కోటాలో విద్యాకమిటీ కోఆప్షన్ సభ్యుడిగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. బాధిత బాలికకు ఇల్లు కూడా లేదు, తండ్రి లేని బాలికకు న్యాయం చెయ్యాలని మీకు అనిపించడం లేదా? ఒక మహిళ హోంమంత్రిగా ఉండి ఇంత వరకూ ఆ కుటుంబాన్ని పరామర్శించి, వారికి భరోసా ఇవ్వాల్సిన భాద్యత లేదా అని విజయలక్ష్మి ప్రశ్నించారు. గ్రామంలో ఎంతోమంది చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదనతో ఉన్నారని, వారి బిడ్డలను కూడా రాయపురెడ్డి బాబీ లోబరుచుకుని ఉన్నాడనే సందేహంతో ఆవేదనకు గురయ్యారన్నారు. పోలీసులు తమ తీరు మార్చుకోవాలని, కూటమి పాలకులకు బానిసల్లా వ్యవహరించవద్దని, ఎల్లకాలం కూటమి ప్రభుత్వం కొనసాగదన్నారు. మరలా మా ప్రభుత్వం వస్తే పరిస్థితులు తారుమారవుతాయని విజయలక్ష్మి హెచ్చరించారు. పార్టీ ఎస్‌ఈసీ సభ్యులు పితాని బాలకృష్ణ, కాశి బాల మునికుమారి, ఎంపీపీ మోర్త రాణి మిరియం జ్యోతి, పార్టీ నాయకులు దొరబాబు, ఎం.శివ, పి.వెంకటేశ్వరావు, కె.ప్రసాద్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి


