
బియ్యం పంపిణీలో కూటమి నేతల కుమ్ములాట
కొత్తపల్లి: మత్సకారులకు బియ్యం పంపిణీ చేసే కార్యక్రమంలో కూటమి నాయకులు కుమ్ములాడుకున్నారు. టీడీపీ, జనసేన నాయకులు కాలర్లు పట్టుకుని వాగ్వాదానికి దిగారు. ఉప్పాడ సచివాలయం వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. వాతావరణంలో మార్పుల కారణంగా ఉప్పాడ తీర ప్రాంతంలో ఇటీవల సముద్రం అలలు ఎగసి పడి గ్రామంలోకి నీరు చేరింది. దీంతో ప్రభుత్వం ఆ ప్రాంతంలోని మత్స్యకారులకు బియ్యం పంపిణీ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఆ మేరకు గురువారం ఉప్పాడ గ్రామ సచివాలయం వద్ద తహసీల్దార్ చిన్నారావు ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి పిఠాపురం నియోజవర్గ జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే బియ్యం పంపిణీపై తమకు సమాచారం ఇవ్వకుండా నిర్వహించడం ఏమిటంటూ టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. కనీసం అధికారులు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జనసేన పార్టీ నాయకులకే చెప్పడమేమిటంటూ ప్రశ్నించారు. దీంతో టీడీపీ, జనసేన నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. మర్రెడ్డి శ్రీనివాస్ ఎదురుగానే కాలర్లు పట్టుకుని తోసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి, సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే తమకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పి, ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తున్నారంటూ మత్సకారులు మండిపడ్డారు. వాటిని తీసుకునేందుకు నిరాకరించారు.
టీడీపీ, జనసేన నాయకుల వాగ్వాదం
ఉప్పాడ సచివాలయం వద్ద ఘటన
పోలీసుల జోక్యంతో
సద్దుమణిగిన వివాదం

బియ్యం పంపిణీలో కూటమి నేతల కుమ్ములాట