
వనదుర్గమ్మకు త్వరలో ఖడ్గమాల పూజ
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో వన సంరక్షురాలిగా, రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో మరో పూజను ప్రారంభించేందుకు దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో నిర్వహిస్తున్న చండీహోమం, ప్రతి పౌర్ణమి, అమావాస్యకు నిర్వహిస్తున్న ప్రత్యంగిర హోమాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ప్రతి శుక్రవారం ఖడ్గమాల పూజ ప్రారంభించనున్నట్లు దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. ఆ రోజు ఉదయం 7.30 నుంచి 8.30 వరకూ జరిగే ఈ పూజలో పాల్గొనడానికి టిక్కెట్ ధరను రూ.1.116గా నిర్ణయించారు.
విజయవాడలో మాదిరిగానే..
దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వనదుర్గ ఆలయ అర్చకుడు అమ్మవారికి ఈ పూజ నిర్వహిస్తారు. భార్యాభర్తలు అమ్మవారికి ఎదురుగా కూర్చుని అర్చకుడు చెప్పిన సూచనల ప్రకారం మంత్రాలు చదువుతూ శ్రీచక్రంపై పసుపు, కుంకుమ, ఇతర ద్రవ్యాలతో ఈ పూజ చేస్తారు. అనంతరం దంపతులకు అమ్మవారి కుంకుమ, రాగి ప్రతిమ, కండువా, రవికల వస్త్రం, 250 గ్రాముల పులిహోర ప్రసాదం అందజేస్తారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించే ఖడ్గమాల పూజ మాదిరిగానే ఇక్కడ కూడా జరుగుతుంది. కాగా.. ఖడ్గమాల పూజపై సలహాలు, సూచనలు ఇవ్వాలని భక్తులు, గ్రామస్తులను దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు కోరారు. ఈ నెల 31వ తేదీ లోపు ఈ నంబర్లకు (98484 81536, 98493 63217, 94907 12066)కు తెలియజేయాలని కోరారు. అలాగే కార్యనిర్వాహణాధికారి, వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, అన్నవరం, శంఖవరం మండలం, కాకినాడ జిల్లా చిరునామాకు, e ndow-eoanna@gov.inకు మెయిల్ ద్వారా సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరారు.
ప్రతి శుక్రవారం నిర్వహించేందుకు దేవస్థానం సన్నాహాలు
టిక్కెట్ ధర రూ.1,116గా నిర్ణయం
భక్తుల సలహాలు కోరిన అన్నవరం ఈవో