
అన్నవరం ఈఈకిఅదనపు బాధ్యతలు
అన్నవరం: స్థానిక వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) వి.రామకృష్ణకు సింహాచలం దేవస్థానం ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. గత మే నెలలో సింహాచలం దేవస్థానంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన దుర్ఘటనలో అక్కడ ఈవోతో పాటు ఈఈని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈఈ స్థానంలో అన్నవరం దేవస్థానం ఈఈ రామకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇకపై రెండు దేవస్థానాలలో ఆయన సేవలు అందిస్తారు.
యువకుడిపై పోక్సో కేసు
అల్లవరం: బాలికను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అల్లవరం మండలంలోని టిడ్కో భవనాల్లో నివాసం ఉంటున్న బాలికను అయినవిల్లి మండలం మాగం గ్రామానికి చెందిన నవుండ్రు రాకేష్ ప్రేమిస్తున్నానని వెంటపట్టాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. తీరా పెళ్లి చేసుకోవాలని అడగ్గా నిరాకరించడంతో ఆ బాలిక అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై సంపత్ కుమార్ కేసు నమోదు చేశారు.
ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
రాజమహేంద్రవరం రూరల్: మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ మహిళ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. హుకుంపేట డి బ్లాక్ రామాలయం వీధి తూర్పుపేటకు చెందిన బత్తిన అప్పాయమ్మ (42) కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు దోసకాయలపల్లికి చెందిన దుర్గారావు సంఘటనా స్థలానికి చేరుకుని అప్పాయమ్మను రాజమహేంద్రవరంప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. దుర్గారావు ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై కె.రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.