
అదుపు తప్పి బస్సును ఢీకొన్న కారు
తాళ్లరేవు: అమలాపురం నుంచి కాకినాడ వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓ కారును ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందారు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన మందపాటి శ్రీరామరాజు, సుభద్రమ్మ (67) దంపతులు ఐ.పోలవరం మండలం పెదమడి గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. జాతీయ రహదారి 216లోని కోరంగి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో వారి కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న అమలాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సుభద్రమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త శ్రీరామరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రయాణికులను వేరే బస్సులో వారి స్వస్థలాలకు తరలించారు. విషయం తెలుసుకున్న కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాకినాడ–యానాం రహదారిలో గత వారం రోజుల్లో జరిగిన మూడు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.
కారులోని మహిళ మృతి
కోరంగి వద్ద విషాదం

అదుపు తప్పి బస్సును ఢీకొన్న కారు