ఫ్రీ జర్నీకి ప్రీ జర్క్‌లు! | - | Sakshi
Sakshi News home page

ఫ్రీ జర్నీకి ప్రీ జర్క్‌లు!

Jul 31 2025 8:36 AM | Updated on Aug 1 2025 1:55 PM

రఫ్రీ జర్నీకి ప్రీ జర్క్‌లు!

రఫ్రీ జర్నీకి ప్రీ జర్క్‌లు!

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నిబంధనలు

ఉమ్మడి జిల్లానా, నూతన జిల్లా పరిధిలోనా అన్నదానిపై స్పష్టత కరవు

కేవలం జిల్లా పరిధిలో అమలు చేసేందుకు ప్రణాళికలు

తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 283 బస్సులు

ప్రతి రోజూ 83 వేల మంది ప్రయాణం

30 వేల మందికి పైగా మహిళలు

25 గ్రామాలకు బస్‌ సౌకర్యం లేదు

ప్రయాణికులు పెరిగితే బస్సుల కొరత ఏర్పడే అవకాశం

సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు సన్నద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఈ హామీ అమలుకు కాలయాపన చేస్తూనే వచ్చింది. సూపర్‌సిక్స్‌ అమలుపై ఎప్పటికప్పుడు వైఎస్సార్‌ సీపీ నిలదీస్తుండటంతో చేసేది లేక అమలుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలనే అంశం గుర్తుకొచ్చింది. ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేస్తామంటూ మంత్రులు ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. 

అయితే అమలుపై పూర్తి స్థాయిలో స్పష్టత కరవైంది. జిల్లాలో ఇప్పటికే బస్సుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో పాటు 25 గ్రామాలకు పైగా ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. గ్రామీణ ప్రాంతాలకే కాకుండా పట్టణ ప్రాంతాలకు సైతం సౌకర్యం ఉండటం లేదు. దీనికితోడు జిల్లా పరిధిలోనే ప్రయాణానికి అనుమతులు ఇస్తారా? ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా?. అన్న విషయమై మీమాంస నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు వెలువరిస్తామన్న ప్రభుత్వం, అధికారులు నేటికీ విడుదల చేయకపోవడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.

జిల్లాలో మాత్రమే?

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కేవలం జిల్లాకు పరిమితం చేస్తారన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం విభజిత జిల్లా పరిధిలో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. జిల్లా దాటితే టిక్కెట్‌ తీసుకోవాల్సి ఉంది. మరోవైపు ఒక మహిళ రోజుకు ఒకసారి మాత్రమే ప్రయాణించేలా నిబంధనలు తీసుకురానున్నట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తుంటే పథకం అమలులో ఆంక్షలు పెడతారన్న విషయం తేటతెల్లం అవుతోంది. మరోవైపు పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగులో ఉచిత ప్రయాణానికి వీలుంటుందన్న మరో వాదన వినిపిస్తోంది.

ఆదాయం రాని మార్గాల్లో పల్లె వెలుగు కట్‌

ఆదాయం రాని మార్గాల్లో పల్లె వెలుగు బస్సులను నిలుపుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు తిప్పలు తప్పవు. ఇప్పటికే 25 మార్గాల్లో పల్లె వెలుగు బస్సులు నడవడం లేదు. ఉన్న పల్లె వెలుగు సర్వీసులు ఉచిత స్కీమ్‌కు వినియోగిస్తే జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు బస్సులు తగ్గుతాయని భావిస్తున్నారు.

కొన్ని బస్సుల్లోనే ఉచితం

ఎన్నికల సమయంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ హామీ ఇచ్చారు. అయితే పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లు, మెట్రో సర్వీసులు, టౌన్‌ సర్వీసుల్లో మాత్రమే ఉచితంగా మహిళలు ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు.

రాష్ట్రమంతా అన్నారు..

సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలన్న తలంపుతో కూటమి నేతలు ప్రతి ఇంటికీ తిరిగారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చుతున్నారు. కేవలం పల్లె వెలుగు, అల్ట్రా బస్సుల్లో మాత్రమే ఉంటుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి వెల్లడించారు. దీనిపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఎక్కడా పల్లెవెలుగు, ఆల్ట్రా డీలక్స్‌ బస్సులలో మాత్రమే ఉచితమని చెప్పలేదు. తీరా అధికారం చేపట్టిన అనంతరం చంద్రబాబు కుతంత్రం బహిర్గతమైందని మహిళలు ఆరోపిస్తున్నారు. చిరు వ్యాపారులు, అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, విద్యార్థినులు పట్టణాలకు వెళ్లాలంటే ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ లగ్జరీ సర్వీసులు ఎక్కువగా ఉంటాయి. వాటిలో ప్రయాణ సదుపాయం ఇవ్వకపోతే ఉపయోగమేంటన్న ప్రశ్న వెల్లువెత్తుతోంది. ఇప్పుడున్న ఒకటి, అర పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించడం కష్టమని పెదవి విరుస్తున్నారు.

రద్దీ ఇలా..

సగటున తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి రోజూ 83,000 మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే మరో 10 నుంచి 20 శాతం మంది అధికంగా ప్రయాణించే అవకాశముందని ఆర్టీసీ అధికారులు వెల్లడిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి నివేదికలను ఇప్పటికే పంపారు. అయితే ఆ దిశగా బస్సుల సంఖ్య పెంచకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కండీషన్‌ అంతంతమాత్రం

గ్రామీణ జనాభా అధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఆర్టీసీ సేవలు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. డిపోలలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న బస్సుల్లో చాలా వరకు కండీషన్‌లో లేవు. డ్రైవర్‌, కండక్టర్ల పోస్టులు సైతం ఖాళీగా ఉన్నా ప్రభుత్వం వాటిని భర్తీ చేయడం లేదన్న విమర్శలున్నాయి.

25 గ్రామాలకు చేరని బస్సు

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 25 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. రాజమహేంద్రవరం డిపో పరిధిలో 12, గోకవరం పరిధిలో 4, కొవ్వూరు 8, నిడదవోలు డిపో పరిధిలో 5 గ్రామాలకు బస్సు వెళ్లడం లేదు. ఆర్టీసీ బస్సు లేని గ్రామాల ప్రజల ఆటోలపై ఆధారపడుతున్నారు. ప్రధానంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయకపోవడంతో ఆటోలలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తే ఉచిత బస్సు ప్రయోజనాలను మహిళలు పొందగలుగుతారు. లేకపోతే కూటమి ప్రభుత్వం ప్రచారానికి మాత్రమే ఈ పథకం అమలుకు పరిమితం అయినట్టు అనుకోవాలి.

10 లక్షల మందికి 283 బస్సులు

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమహేంద్రవరం, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు డిపోల పరిధిలో మొత్తం 283 బస్సులు ఉన్నాయి. అందులో పల్లెవెలుగు 167, ఆల్ట్రా 67, ఎక్స్‌ప్రెస్‌ 37 బస్సులు, 12 ఏసీ బస్సులు. ఇవి జిల్లా వ్యాప్తంగా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే ఆయా రూట్లలో బస్సులు తక్కువగా ఉండటం, రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆర్టీసీ సర్వీసులపై ఏడాదిగా విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణమంటే ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంటుంది. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 18,32,332 ఉండగా.. అందులో పురుషులు 9,11,520 ఉన్నారు. సీ్త్రలు అత్యధికంగా 9,20,812 మంది ఉన్నారు. ప్రసుత్తం ఈ సంఖ్య మరింతగా పెరిగి 10 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉంది. ఇంతమంది మహిళలున్న జిల్లాలో కేవలం 283 బస్సులకు మాత్రమే సదుపాయం కల్పించడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.

జిల్లాలో బస్సుల వివరాలు ఇలా...

డిపో పల్లె ఆల్ట్రా ఎక్స్‌ప్రెస్‌

వెలుగు డీలక్స్‌

రాజమహేంద్రవరం 64 15 22

గోకవరం 30 12 14

కొవ్వూరు 42 0 1

నిడదవోలు 31 0 0

ప్రతి రోజూ 83,000 మంది ప్రయాణం

జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ 83,000 మంది ప్రయాణాలు సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇందులో 30,000 మందికి పైగా మహిళలు ఉంటున్నారు. వీళ్లందరికీ బస్సులు ఏర్పాటు చేయడంపై అధికారుల్లో ఆందోళన నెలకొంది. నేటికీ స్పష్టమైన విధి, విధానాలు వెలువరించకపోవడంతో పథకం అమలుపై గందరగోళం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement