
వానపల్లిలో క్షుద్ర పూజల కలకలం!
కొత్తపేట: వానపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారన్న వదంతులపై కలకలం రేగింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. వానపల్లి గాంధీ బొమ్మ సెంటర్‌లో నలుగురు అన్నదమ్ములకు చెందిన ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో నలుగురిలో పెద్దాయన కుమారుడు ఒక్కడే ఉంటున్నాడు. అతడికి వివాహం కాలేదు. కాగా.. నాలుగు రోజులుగా ఆ ఇంట్లో రహస్యంగా పూజలు నిర్వహిస్తున్నట్టు సమీపంలోని ప్రజలు గమనించారు. ఆ నోటా ఈ నోటా గ్రామమంతా ప్రచారం జరిగింది. దీంతో బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామ వీఆర్వో లంక వెంకట నాగరాజు, పోలీసు కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్న అనంతరం గ్రామస్తులు మూకుమ్మడిగా ఆ ఇంటిని చుట్టుముట్టి లోపలకు ప్రవేశించారు. అక్కడ ఒక గదిలో సుమారు మీటరు నలుచదరంలో సుమారు 30 అడుగుల లోతు గొయ్యి తవ్వి ఉంది. దానిలో పూజా సామగ్రితో పాటు, దిగటానికి నిచ్చెన, తాడు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులను ఇదేమిటని గ్రామస్తులు నిలదీశారు. దానితో ఆ ఇంటికి చెందిన వ్యక్తి మొదట బాత్‌రూమ్‌కు తవ్వుతున్నామని, తర్వాత ఎముకలు ఉన్నాయని, తవ్వి తీసేయమని సిద్ధాంతి చెప్పారని అన్నాడు. ఎముకలు ఎక్కడ అని ప్రశ్నించగా, బయట పారేశామన్నారు. రంపచోడవరం, రాజమహేంద్రవరం నుంచి నలుగురిని తీసుకువచ్చి, ఈ గొయ్యి తవ్వినట్టు తెలుస్తోంది. అమలాపురానికి చెందిన ఒక వ్యక్తితో అక్కడి పూజ చేయిస్తున్నట్టు సమాచారం. దీనితో ఆరుగురిని అదుపులోకి తీసుకుని కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఎస్సై జి.సురేంద్రను ‘సాక్షి’ వివరణ కోరగా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారన్న స్థానికుల అనుమానంతో పిర్యాదు చేశారని, విచారణ చేయాల్సి ఉందన్నారు.
ఒక ఇంట్లో 30 అడుగుల లోతు గొయ్యి
గ్రామస్తుల భయాందోళన
ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు